Sunkara Ramachandra Rao | ఒకప్పుడు పత్రికల డెస్కులలో చైతన్యపూరితమైన రాజకీయ చర్చలు చోటు చేసుకుండేవని ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు కే శ్రీనివాస్ అన్నారు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ మార్క్సిస్టు అధ్యయనకారుడు సుంకర రామచంద్రరావు సంస్మరణ సభను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కే శ్రీనివాస్ మాట్లాడుతూ రామచందర్ రావుతో కలిసి మూడేళ్లు కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఎంత కష్టమైన, కఠినమైన వార్తను అవలీలగా ఆయన రాసేవారని చెప్పారు. అప్పట్లోని రాజకీయ పరిస్థితుల గురించి డెస్కులో చర్చలు జరిగేవన్నారు. గత ఏడాది ఆంధ్రజ్యోతిలో రామచందర్ రావు రాసిన ఆర్టికల్ గురించి చర్చించేందుకు ఆయనతో మాట్లాడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మరిచిపోలేనివని
తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. రామచందర్ రావుతో 12 ఏళ్లు కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో డెస్కులో ఏదో ఒక అంశంపై చర్చలు జరిగేవని చెప్పారు. అప్పటికీ, ఇప్పటి డెస్కులకు మధ్య చాలా తేడా ఉందన్నారు. అప్పటి డెస్కుల్లో పనిచేసిన తమది గొప్పతరమని ఆయన అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు భావజాలాన్ని, ప్రగతి శీల భావజాలాన్ని కాపాడిన తరమని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ సురేందర్ రాజు మాట్లాడుతూ.. రామచందర్ రావు కరుడుగట్టిన కమ్యూనిస్ట్ మాదిరిగానే కనిపించేవారని అన్నారు. పిల్లల జీవితాలు స్కూళ్లలో బందీ కాకూడదనే భావన రామచందర్ రావుకు ఉండేదన్నారు. కొత్త ఆలోచనలను స్వీకరిస్తుంటారని తెలిపారు. సమాచార హక్కు కమిషన్ మాజీ సభ్యుడు కట్టా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఆయన ఉండేవారన్నారు. డయాలసిస్ వరకు వస్తే సాధారణంగా ఎవరన్నా భయపడతారని, కానీ రామచందర్ రావు ఏనాడూ భయపడలేదని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీల నేపథ్యం నుంచి వచ్చినవారి పట్ల రామచందర్‌రావు ఎంతో ఆప్యాయంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. రామచందర్ రావు రచనలు పుస్తకరూపంలో రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.