గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ గేమ్ చేంజర్ కాబోతోంది: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి 8లేన్ విస్తరణకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని 2026 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం కానున్నాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు
2026 ఫిబ్రవరిలో హైదరాబాద్ – విజయవాడ 8 లేన్ల రహదారి పనులు ప్రారంభం
అధునాతన టెక్నాలజీతో యాక్సిడెంట్ ఫ్రీ రహదారి నిర్మాణం
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విధాత): హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి 8లేన్ విస్తరణకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని 2026 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం కానున్నాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉండడమే కాకుండా యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్న రహదారుల్లో ఒకటని మంత్రి అన్నారు. ఇప్పటికే 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసినప్పుడు ఈ అంశాన్ని గుర్తు చేశానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాక్సిడెంట్ ఫ్రీ రహదారిని అందుబాటులోకి తేనున్నామని,అధునాతన టెక్నాలజీతో,పూర్తి నాణ్యతతో హైదరాబాద్ నుంచి విజయవాడ కు రోడ్ నిర్మించబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ 8 వరుసల రహదారి పనులు పూర్తి అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 230 కి.మీ గ్రీన్ ఫీల్డ్ హైవే పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పూర్తి సానుకూలంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. డీపీఆర్ ఎస్టిమేట్స్ త్వరలో పూర్తి కానున్నాయని, గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నిలవబోతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram