Telangana Assembly | ఆర్టీసీ సమస్యలపై అసెంబ్లీలో మంత్రి పొన్నం వర్సెస్ హరీశ్‌రావు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు బుధవారం ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, మాజీ మంత్రి టి.హరీశ్‌రావుకు మధ్య మాటల యుద్ధం సాగింది.

హరీశ్‌రావును తప్పించలేక కార్మిక సంఘాలను రద్ధు చేశారు
సీఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు
విధాత, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు బుధవారం ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, మాజీ మంత్రి టి.హరీశ్‌రావుకు మధ్య మాటల యుద్ధం సాగింది. ఆర్టీసీ బకాయిలపై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, ఆర్టీసీ కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తెస్తామన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్ డేట్ ప్రకటిస్తారని..? కార్మికులు యూనియన్ పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులతో అదనపు గంటలు పని చేయిస్తున్నారని ఆరోపించారు.
ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పుటి లోగా భర్తీ చేస్తారని హరీష్ రావు ఫ్రశ్నించారు. దీనిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ఆర్టీసీపై బీఆరెస్ మొసలి కన్నీరు కారుస్తుందన్నారు. ఎన్నిలకకు ముందు ఆదరబాదరాగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారని, గత ప్రభుత్వం ఆర్టీసీకి పెట్టిన పెండింగ్ బకాయిలను మేం చెల్లించామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేం మా ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలోనే యూనియన్లను రద్దు చేసి పునరుద్ధరణ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఆనాడు డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసిన అప్పటి బీఆరెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆర్టీసీ సొమ్మును గత బీఆరెస్ ప్రభుత్వమే వాడుకుందని నిప్పులు చెరిగారు. ఆర్టీసీకి మా ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీలోకి కొత్త బస్సులను కొంటున్నామని, త్వరలోనే 3,035 మంది ఉద్యోగులను నియమిస్తున్నామని వెల్లడించారు. పని భారం పెరిగిన ఆర్టీసీ కార్మికులు బాగా పని చేస్తున్నారని.. ఇందుకు ఆర్టీసీ కార్మికులను అభినందిస్తున్నామన్నారు.
హరీశ్‌రావును తప్పించలేక కార్మిక సంఘాలను రద్ధు చేశారు : సీఎం రేవంత్‌రెడ్డి
ఆర్టీసీపై చర్చ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావుకు స్పీకర్ ప్రసాద్ మాట్లాడేందుకు అవకాశమివ్వగా హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. హరీష్ రావు పదేళ్ల పాటు మంత్రిగా, శాసన సభ వ్యవహారాల మంత్రిగా కూడా పని చేశారని.. అసెంబ్లీ నిబంధనలపై అవగాహన ఉన్న వ్యక్తి స్పీకర్‌పై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.సభలో సగం మంది వరకు తొలిసారి శాసన సభ్యులుగా ఎన్నికైన వారు ఉన్నారని, హరీశ్‌రావు వంటి అనుభవజ్ఞుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించడం మాని ఆదర్శంగా ఉండాలన్నారు.
ప్రతిపక్ష నేతలు సభ నియమ నిబంధనలు పాటించాలన్నారు. కార్మికుల తరుపున పోరాడే కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే సాంబశివరావుకు స్పీకర్ అవకాశం ఇవ్వడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టడం సరికాదన్నారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా గతంలో ఆర్టీసీ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్‌రావును తప్పించలేక అప్పటీ సీఎం కేసీఆర్ కార్మిక సంఘాలనే రద్ధు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీపై చర్చ సందర్భంగా రేవంత్‌రెడ్డి స్పందిస్తూ కుటుంబ రాజకీయం నేపథ్యంలో కార్మిక సంఘాలను రద్ధు చేశారన్నారు. ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రణాళికతో ఉందన్నారు.