Seethakka : మేడారం మాస్టర్ ప్లాన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు
సమక్క–సారలమ్మల త్యాగాల స్ఫూర్తిని ప్రతిబింబించే మేడారం మాస్టర్ ప్లాన్ ఇంకా ఫైనల్ కాలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 10(విధాత): ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీకగా, సమక్క–సారలమ్మ తల్లుల త్యాగాల స్ఫూర్తిని ప్రతిబింబించే మేడారం మాస్టర్ ప్లాన్ డీపీఆర్ ఇంకా తుది రూపం దాల్చలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. దీనిపై అనవరసర రాద్దాంతం చేయడం తగదని హెచ్చరించారు. ఆదివాసీ సంస్కృతి, సమ్మక్క సారాలమ్మ పూజారుల విశ్వాసాలు, లక్షలాది భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే డీపీఆర్‌ను ఫైనల్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మేడారం పర్యటన అనంతరం మాస్టర్ ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
సమక్క–సారలమ్మల త్యాగాలు, ఆదివాసీల అచంచలమైన తెగువ, వారి పోరాట స్ఫూర్తి ప్రతిఫలించేలా మేడారం మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఈ ప్రక్రియలో సమ్మక్క సారలమ్మ తల్లుల పూజారుల సూచనలు, రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటివారి ప్రమేయం ఉండదని ఆమె స్పష్టం చేశారు. ఆదివాసీల సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఎలాంటి భంగం కలగకుండా, వారి సంప్రదింపులు, మార్గదర్శకాల ఆధారంగానే మాస్టర్ ప్లాన్‌ను ఆమోదిస్తామని సీతక్క స్పష్టం చేశారు.
మేడారం మాస్టర్ ప్లాన్ కు రాజకీయాలు ఆపాదించడం సరి కాదన్నారు మంత్రి సీతక్క. మేడారం మాస్టర్ ప్లాన్ పూర్తిగా ఆదివాసీల విశ్వాసం, సంప్రదాయం, భక్తి భావం ఆధారంగా ముందుకు సాగుతుందని, రాజకీయ లబ్ధి కోసం దానిని ఉపయోగించుకోవడం తగదని సూచించారు.