గిరిజనుల అభివృద్ధికి మెరుగైన చట్టాలు రావాలి
విధాత, హైదరాబాద్ : ఆదివాసీల మనుగడ అడవులతో ముడిపడి ఉందని, అడవుల ఆధారంగా బతికే గిరిజనులు అడవులను ఎప్పుడూ నాశనం చేయరని, ఆదివాసీల మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గురువారం “గిరిజన జీవనోపాధి పద్ధతులు.. సాధికారత, సమస్యలు” అనే అంశంపై డాక్టర్ బీఆరెస్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జూబ్లీ హిల్స్ క్యాంపస్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడారు. మైనింగ్ కంపెనీలు, కార్పొరేట్లు అడవులను నాశనం చేస్తున్నాయని, సహజ వనరులు అపారంగా వున్న అడవులను కొల్లగొడుతున్నారని విమర్శించారు. అడవులు మిగలడానికి ఆదివాసీలు, అడవి బిడ్డలే కారణమన్నారు.
అడవులను ఆదివాసులు విధ్వంసం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ ఆదివాసులను అణచి వేస్తున్నారన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో చట్టాలు వున్నా అనుకున్న స్థాయిలో ఆ జాతులు అభివృద్ధి జరుగలేదన్నారు. సమాజంలో ఒక వైపు అభివృద్ధి జరుగుతుంటే..ఏజెన్సీ ప్రాంతాలు సమస్యలతో సత మత మవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్య భారత దేశంలో ఆదివాసీల మీద దాడులు సాగుతున్నాయని, ఆదివాసీల హక్కులను హననం చేస్తున్నారన్నారని ఆరోపించారు. మేధావులు ఆ అంశం మీద మరింత మాట్లాడాలని, మెరుగైన చట్టాలు, పథకాల రావాలన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం స్థానిక అభివృద్ధి నమూనా ను మేధావులు రూపొందించాలని కోరారు. ఆ మోడల్ ను అమలు చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు.