Minister Sridhar Babu : ‘ఫార్మసీ ఆఫ్ పర్పస్’ గా తెలంగాణ

తెలంగాణను 'ఫార్మసీ ఆఫ్ పర్పస్' గా మారుస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వరంగల్, నల్గొండలో టీ-హబ్ తరహాలో ఇంక్యూబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, 18 నెలల్లో రూ.54 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.

Minister Sridhar Babu : ‘ఫార్మసీ ఆఫ్ పర్పస్’ గా తెలంగాణ

విధాత, హైదరాబాద్ : తెలంగాణను “ఇన్నోవేషన్ హబ్” గా మార్చాలన్నదే తమ సంకల్పమని, వరంగల్, నల్గొండలోనూ టీ-హబ్ తరహాలో ఇంక్యూబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయాలతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లుగా వివరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్ని’ గోల్డెన్ జూబ్లీ వేడుకలను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సైన్స్ కు మానవత్వాన్ని జోడిస్తే ప్రతి ఆవిష్కరణ సమాజహితానికి బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణను గ్లోబల్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్ గా మాత్రమే కాకుండా ‘ఫార్మసీ ఆఫ్ పర్పస్’గానూ మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. రీసెర్చ్ ను మార్కెట్‌కు, పాలసీని రోగికి అనుసంధానించే సమగ్రమైన 360 డిగ్రీల ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా రూ.54వేల కోట్ల పెట్టుబడులు

18 నెలల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా రూ.54వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఎలీ లిల్లీ లాంటి అంతర్జాతీయ ఫార్మా దిగ్గజ కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చి, ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.డాక్టర్ల కంటే వేగంగా రోగాలను నిర్థారించినా, అనుభూతి చెందే మనసును మాత్రం ఏ యంత్రం భర్తీ చేయలేదన్నారు. దేశంలో తమ అనుభవాన్ని ‘నాలెడ్జ్ ఇన్వెస్ట్ మెంట్’గా పెట్టేందుకు ముందుకు రావాలని ప్రవాసీ భారతీయ నిపుణులకు విజ్ఞప్తి చేశారు. పేటెంట్లను కాకుండా మీ ఆవిష్కరణ వల్ల ఎంత మందికి మేలు జరిగిందన్నదే చరిత్ర గుర్తుంచుకుంటుందని యువ ఇన్నోవేటర్స్ కు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి, డా.బి.ప్రభా శంకర్, రాంప్రసాద్ రెడ్డి, ప్రద్యుమ్న, డా.తామర విజయ్ కుమార్, ప్రొఫెసర్ భాస్కర్ ఆర్.జాస్తి, రాజేశ్వర్ తోట, ప్రొఫెసర్ జె. కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.