విధాత, హైదరాబాద్ :
గత ప్రభుత్వం ఆర్థిక ఆరాచకానికి పాల్పడిందని, కేటీఆర్ ఆలోచనలో ఇంకా మార్పు రావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండస్ట్రీయల్ పాలసీపై, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీజ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని గత ప్రభుత్వంలో జీవోలు తెచ్చారన్నారు. ఫ్రీ హోల్డ్ భూములకు ఇన్ఫాక్ట్ ఫీజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే ప్రయత్నం చేస్తోందని మంత్రి వివరించారు. కేటీఆర్ చెప్పే 30శాతం భూమి విలువ కాదు… కేవలం కన్వర్శన్ ఫీజు మాత్రమేనని చెప్పారు.
ఫ్రీ హోల్డ్ కు… లీజు భూములకు సంబంధం లేకుండా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం లో తెచ్చిన జీవోలను ఇప్పుడు అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. అడ్డగోలుగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని, బీఆర్ఎస్ సత్యధురమైన మాటలు మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్వర్శన్ కు.. భూమికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక భూములు కన్వర్శన్ చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా బీఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
కేటీఆర్ చెప్పిన పేరు కలిగిన వాళ్ళు MOU చేసుకున్నట్లు నిరూపిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని సూచించారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీ అవ్వకుండా బీఆర్ఎస్ అడ్డుపడుతుందన్నారు. జూబ్లీహిల్స్ లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయని. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. కేటీఆర్ మాట్లాడే అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని ఆయన సూచించారు.
