బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా

- పార్టీలో మహిళలపై చిన్నచూపంటూ ఆరోపణ
- జాన్సన్ నాయక్ ఎస్టీ కాదు.. కన్వర్టెడ్ క్రిస్టియన్
- గులాబీ అభ్యర్థిని ఓడిస్తా
- నిధులన్నీ ముధోల్, నిర్మల్ నియోజకవర్గాలకు మళ్లింపు
- తన మీద ద్వేషంతో నియోజకవర్గంపై చిన్నచూపు
- ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గ కేంద్రంలోని స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ కు మహిళలంటే చిన్న చూపని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యే నియోజకవర్గం అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని, నిధులు ఇవ్వకుండా అడ్డుపడ్డారని ఆమె విమర్శించారు.
ఖానాపూర్ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం వచ్చిన నిధులను నిర్మల్, ముధోల్ నియోజకవర్గాలకు తరలించారని ఆరోపించారు. దళిత బంధు ప్రతి నియోజకవర్గంలో 1100 మంది లబ్ధిదారులకు ఇస్తే, ఖానాపూర్ నియోజకవర్గంలో 300 మందికి మాత్రమే మంజూరు చేశారన్నారు. ప్రతి అంశంలోనూ ఖానాపూర్ నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఎస్టీ నియోజకవర్గం అనే చిన్నచూపుతో నిధులు ఇవ్వకుండా, కేటీఆర్ స్నేహితుడి కోసం ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అసలు ఎస్టీ సామాజిక వర్గం కాదని, ఆయన ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ అని తెలిపారు. అలాంటి జాన్సన్ నాయక్ కు టికెట్ ఇచ్చి, తనకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. జాన్సన్ నాయక్ అటు క్రిస్టియన్లను, ఇటు హిందువులను మోసం చేశారని ఆరోపించారు. కేటీఆర్ స్నేహితుడైతే ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం ప్రాజెక్టు కోసం నిధులను తెప్పించి ఎందుకు అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ ను రాబోయే ఎన్నికల్లో ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా వివక్ష చూపారని పేర్కొన్నారు. అంతర్గత రోడ్లకు అటవీశాఖ అనుమతుల పేరుతో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. త్వరలోనే తాను ఏ పార్టీకి వెళ్తున్నాం అనే విషయాన్ని తెలియజేస్తానని, ఖానాపూర్ లో పాదయాత్ర ప్రారంభించి ఇంద్రవెల్లి వరకు కొనసాగిస్తానన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తనకు చేసిన అన్యాయంపై ప్రజలకు వివరిస్తానని తెలిపారు.