చెల్లని ఓట్లలో ‘పట్టభద్రులు’.. మూడవ రౌండుకే 23784 చెల్లని ఓట్లు

నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపోటములను పక్కనపెడితే చెల్లని ఓట్లు చర్చనీయాంశంగా మారాయి.

  • Publish Date - June 6, 2024 / 07:48 PM IST

కౌంటింగ్ ప్రక్రియకు అడ్డంకులు
ఏజెంట్ల మధ్య వాగ్వివాదానికి దారి

విధాత ప్రత్యేక ప్రతినిధి: నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపోటములను పక్కనపెడితే చెల్లని ఓట్లు చర్చనీయాంశంగా మారాయి. బాగా చదువుకున్నొల్లుగదా? ఆచితూచి ఓటేస్తారని ఆశిస్తారు. వేసే ఓటు కూడా పక్కగా పద్ధతిగా వేస్తారని భావిస్తారు. కానీ, దీనికి ఉల్టాగా కౌంటింగ్ లో పట్టభద్రుల ప్రావీణ్యత కన్పిస్తోంది. చదువుకున్నల్లకంటే నిరక్షరాస్యులే పద్ధతిగా ఓటేస్తారని నిరూపిస్తున్నారు. నల్లగొండలో జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో ఈ పదనిసలు వెలుగుచూస్తున్నాయి. గురువారం సాయంత్రానికి మొదటి ప్రాధాన్యతకు సంబంధించిన మూడవ రౌండ్ లెక్కింపు పూర్తయ్యి నాలుగవ రౌండ్ ప్రారంభమైంది. ఇప్పటికే 23784 ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు గుర్తించారు. రెండవ రౌండు పూర్తయ్యేసరికి మొత్తం 1,92,277 లెక్కించగా ఇందులో చెల్లిన ఓట్లు 1,77,151 ఉండగా 5,126 ఓట్లు చెల్లనవిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కౌంటింగ్ ప్రక్రియకు అడ్డంకులు

లెక్కింపు ప్రక్రియలో అసలు ఓట్లకంటే చెల్లని ఓట్లు పెద్ద సమస్యగా మారినట్లు చెబుతున్నారు. ఈ చెల్లని ఓట్ల వ్యవహారం రాజకీయపార్టీల ఏజెంట్ల మధ్య లొల్లికి దారితీస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఓటు తమకే ఓసేరంటే కాదుకాదు తమకే వేసేరని పరస్పరం వాదులాడుకోవడంతో అధికారులు సైతం తలలుపట్టుకుంటున్నారు. ప్రత్యర్ధికి వేసిన ఓటును ఇతరపార్టీలు అభ్యంతరం చెప్పడంతో లెక్కింపు ప్రక్రియ కూడా జాప్యమవుతున్నట్లు చెబుతున్నారు. ప్రాధాన్యత ఓట్లు వేయడంలో కొందరు తప్పుడు పద్ధతిని అనుసరిస్తే మరికొందరు తమ అభ్యర్ధిపై అతిప్రేమతో రకరకాల వ్యాఖ్యలు రాయడం ఇప్పుడు ఓటు చెల్లకుండా పోయే పరిస్థితి నెలకొంది.

 

Latest News