‘Musi Project’ । ‘మూసీ ప్రాజెక్టు’ దేశంలోనే అతి పెద్ద కుంభకోణం : బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్

‘2400 కిలోమీటర్ల నమామీ గంగా ప్రక్షాళన కోసం మొత్తం ఖర్చు చేసిందే 40 వేల కోట్లు. 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు రూ. లక్షా 50 వేల కోట్లా? దీని వెనుక ఉన్న మతలబు ఏంటీ? ఇది స్కాం కాకపోతే ఏంటి?

‘Musi Project’ । ‘మూసీ ప్రాజెక్టు’ దేశంలోనే అతి పెద్ద కుంభకోణం : బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్

‘Musi Project’ । మూసీ ప్రాజెక్ట్ పేరుతో దేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరలేపిందని బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, మహబూద్ అలీ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నాయకురాలు తుల ఉమ తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో వచ్చే ఎన్నికల కోసం ఈ మూసీ ప్రాజెక్టును కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులా వాడుకోవాలని చూస్తోందని విమర్శించారు. నమామీ గంగే ప్రాజెక్టుకే రూ.40 వేలు కోట్లు  ఖర్చు చేస్తే.. మూసీ ప్రాజెక్ట్ కోసం లక్షా 50 వేల కోట్లా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇది కుంభకోణంకాక మరేమిటన్నారు.

మూసీ బాధితుల పాలిట రేవంత్ రెడ్డి కాలయముడిగా మారాడని కేటీఆర్ ఆరోపించారు. బాధితుల అక్రందనలు కాంగ్రెస్‌ నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు తిట్టే తిట్లు గతంలో ఎప్పుడూ తాను వినలేదన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అవసరమైతే న్యాయం కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. ‘ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పేదల ఇల్లు కూల్చమని ఇందిరమ్మ చెప్పిందా? సోనియమ్మ చెప్పిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో నడుస్తున్న బుల్డోజర్ అరాచకాలను పరిగణలోకి తీసుకొని చట్టపకారం వెళ్లాలనిని సూచించిన హైకోర్టుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఆక్రమణలకు సంబంధించి నేరం చేసిందెవరు? శిక్ష వేసేదెవరికి? అని కేటీఆర్ ప్రశ్నించారు. 1994 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు వచ్చాయని ప్రజలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వాళ్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు. మరి ఆనాడు రిజిస్ట్రేషన్లు, కరెంట్, వాటర్ బిల్లులు తీసుకున్నప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు? అని ప్రశ్నించారు. పేద, మధ్య తరగతి వాళ్లకు ఇల్లు అనేది ఒక ఎమోషన్ అని కేటీఆర్‌ చెప్పారు.. అలాంటి ఇళ్లను నిర్దాక్ష్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియదు. మాకు తెలుసన్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చట్ట బద్దంగా అన్ని పర్మిషన్లు వాళ్లకు ఉన్నాయని, అయినా సరే వాళ్లు ఆక్రమణలకు పాల్పడినట్లు కనుగోలు ఆధ్వర్యంలో 500 మందితో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

2016 లో బఫర్ జోన్, ఎఫ్ టీఎల్, చెరువు మ్యాప్ లను సిద్ధం చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. 2016 వరకు కూడా ఎల్ టీఎల్, బఫర్ జోన్ చూడకుండా ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చారని ఆరోపించారు. మీకు దమ్ముంటే పర్మిషన్లు ఇచ్చిన వాళ్లు, వాటిని ప్రోత్సహించిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. లక్షలాది మంది జీవితాలను అంధకారం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. మరి మూసీ ప్రాజెక్ట్ తో మురిసె రైతులెంత మంది? ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు వస్తాయా? మరి అలాంటిది ప్రాజెక్టుకు లక్షా 50 వేల కోట్లా ఖర్చు ఎందుకు? అని కేటీఆర్ అడిగారు. మూసీ ప్రాజెక్ట్ కు లక్షా 50 వేల కోట్లంటే అది కాంగ్రెస్ కు రిజర్వ్ బ్యాంక్ లాంటిదేనన్నారు. సబర్మతి ప్రాజెక్ట్ కు 7 వేలకు పైగా ఖర్చు అయ్యింది. యుమునా నది ప్రక్షాళనకు వెయ్యి కోట్లు ఖర్చు అయ్యింది. థేమ్స్ నదికి కూడా వాళ్లు ఖర్చు చేసింది రూ. 40 వేల కోట్ల మాత్రమేనన్నారు.