Revanth Reddy Cabinet | కొత్త మంత్రులకు దక్కని ప్రాధాన్యం!

Revanth Reddy Cabinet | భారీ స్థాయిలో పైరవీలు చేసుకుని, కష్టపడి పేరుకైతే మంత్రి పదవులు దక్కించుకున్నారు కానీ.. కొత్త మంత్రులకు ప్రాధాన్యం ఉన్న శాఖలు దక్కలేదనే చర్చలు అటు సచివాలయంలోనూ, ఇటు గాంధీభవన్‌లోనూ వినిపిస్తున్నాయి.

Revanth Reddy Cabinet | కొత్త మంత్రులకు దక్కని ప్రాధాన్యం!

ఇచ్చివన్నీ అప్రాధాన్య శాఖలే
గ్రూపు రాజకీయాల బాధితులు
భారీ పునర్వ్యవస్థీకరణకు ప్లాన్‌ చేసిన ముఖ్యమంత్రి
మార్పులకు హై కమాండ్‌ నో
ఉన్నవే పంచిపెట్టిన రేవంత్‌
కీలక శాఖలు ముఖ్యమంత్రి వద్దే

Revanth Reddy Cabinet | హైదరాబాద్, జూన్ 12 (విధాత) : భారీ స్థాయిలో పైరవీలు చేసుకుని, కష్టపడి పేరుకైతే మంత్రి పదవులు దక్కించుకున్నారు కానీ.. కొత్త మంత్రులకు ప్రాధాన్యం ఉన్న శాఖలు దక్కలేదనే చర్చలు అటు సచివాలయంలోనూ, ఇటు గాంధీభవన్‌లోనూ వినిపిస్తున్నాయి. పదవులు ఇచ్చినా.. కొత్త మంత్రులకు అధిష్ఠానం అన్యాయం చేసేందనే అభిప్రాయా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల నుంచి ఒక్క శాఖను కూడా తొలగించవద్దని అధిష్ఠానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆదేశించినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇతరుల జోలికి వెళ్లకుండా.. తన వద్ద ఉన్న కీలక శాఖలను కాపాడుకుంటూ.. కొత్త మంత్రులకు ప్రాధాన్యం లేని శాఖలను కేటాయించారని అంటున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర తరువాత మంత్రివర్గాన్ని విస్తరించారు. మొత్తం ఆరు ఖాళీలు ఉండగా మూడు ఖాళీల భర్తీకే అధిష్ఠానం అనుమతించింది. ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, కరీంనగర్ నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మహబూబ్ నగర్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.. రేసులో ముందుభాగాన నిలిచి.. మంత్రి పదవులు దక్కించుకున్నారు. తమకు కీలక శాఖలు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. అయితే.. కొత్త వారికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్టీ పెద్దలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మంత్రి మండలిలో ఉన్నవారి నుంచి కొన్ని శాఖలను తొలగించి, కొత్తగా చేరిన ముగ్గురికి కేటాయించాలనే ప్రతిపాదనను వారి ముందు ఉంచినట్టు తెలుస్తున్నది. పనితీరు బాగా లేకపోవడం, ఆరోపణలు రావడం, ప్రజల్లో వ్యతిరేకత పేరుతో కొందరు మంత్రుల నుంచి కొన్ని శాఖలను తీసేసి.. వాటిని కొత్త మంత్రులకు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి భావించినట్టు తెలిసింది. ప్రత్యేకించి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నుంచి ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి పౌర సరఫరాల శాఖ, ఐటీ మంత్రి డీ శ్రీధర్ బాబు నుంచి పరిశ్రమల శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచి హౌసింగ్, పౌర సంబంధాల శాఖలను తీసివేసి, చరుకుగా పనిచేస్తున్న వారికి వాటిని కేటాయించాలని భావించినట్టు తెలిసింది. ముగ్గురు కొత్త మంత్రులకు వద్దనున్న విద్య, మునిసిపల్ శాఖలను ఇస్తారనే వార్తలొచ్చాయి. ఇదే అంశాన్ని పార్టీ పెద్దల ముందు పెట్టి చర్చించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అంతా విన్న పెద్దలు ఏం మాట్లాడకుండా మౌనం దాల్చారని సమాచారం. ఆ తరువాత ఢిల్లీకీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి, మంత్రి ఉత్తమ్ రెడ్డిని పిలిపించి మాట్లాడారు. శాఖల పునర్వవస్థీకరించాలని ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనపై వారితో చర్చించారని తెలిసింది. తమ వద్ద ఉన్న శాఖలను తొలగించవద్దని కోరిన భట్టి, ఉత్తమ్‌.. సీఎం వద్ద హోం, మునిసిపల్, విద్య, పశు సంవర్థక, కార్మిక, పట్టణాభివృద్ధి, సంక్షేమం వంటి కీలక శాఖలు ఉన్నాయని, వాటిని కొత్త మంత్రులకు కేటాయిస్తే సరిపోతుందంటూ తమ వాదనలను భట్టి, ఉత్తమ్‌ వివరించారని సమాచారం. ఈ కారణంగానే పునర్వవస్థీకరణ ఆగిపోయిందని ఇందిరా భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అధిష్ఠానం ఆదేశాలతో చిన్నబుచ్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అసహనంతో ఎలాంటి ప్రాధాన్యం లేని శాఖలను కొత్త మంత్రులకు ఇచ్చినట్టు కనిపిస్తున్నదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

పనిచేసే స్కోప్‌ లేని శాఖలు!

గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక శాఖతో పాటు గనుల శాఖ అప్పగించారు. కార్మిక శాఖలో పనిచేయడానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ మాత్రం అవకాశం లేదని అంటున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తూ వస్తున్నది. దీంతో.. అందులో పెద్దగా సామర్థ్యం నిరూపించుకునే అవకాశాలు లేవని వివేక్‌ వర్గీయులు పెదవి విరుస్తున్నారు. ఇక ఉపాధి కల్పన అనేది ఉత్త మాటనే. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్‌ల అడ్రస్‌ను నిరుద్యోగులు ఏనాడో మర్చిపోయారని అంటున్నారు. గనుల శాఖ విషయానికి వస్తే కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ఏమాత్రం పనికి వచ్చేది కాదంటున్నారు. కొత్తగా అనుమతించేది ఏమీ లేదు కానీ.. ఉన్నవాటికి రెన్యువల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా జిల్లా స్థాయి అధికారులు చూసుకుంటారు. ఇసుక వ్యాపారం గనుల శాఖ కిందే వస్తుంది. ఈ వ్యాపారాన్ని కూడా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఇసుకను ప్రభుత్వమే విక్రయిస్తున్నప్పటికీ రీచ్ ల వద్ద స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు పెత్తనం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. విద్యతో పాటు పరిశ్రమలు, ఐటీ శాఖలను అప్పగించనున్నారని తమకు తెలిసిందని, కానీ.. అది వాస్తవరూపం దాల్చలేదని వివేక్‌ వర్గీయులు వాపోతున్నారు.

వాకిటి శ్రీహరికి కూడా పశు సంవర్థక శాఖ కేటాయింపు మొక్కుబడేనని అంటున్నారు. వాస్తవానికి ఆయనకు హోం శాఖ ఇస్తారనే ప్రచారం సాగింది. కానీ.. ఆఖరుకు పశు సంవర్థక శాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలతో సరిపుచ్చారు. ఈ రెండు శాఖలకు నిధులు కూడా బొటాబొటిగా కేటాయించారు. ఉద్యోగుల జీతాలు మినహా ఇక్కడ చేయడానికి, ప్రజలకు చెప్పుకోవడానికి పెద్దగా పథకాలు లేవు కూడా. చేపలు, గొర్రెలు పంపిణీ చేద్దామన్నా నిధులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోగా, గత బీఆర్ఎస ప్రభుత్వం అక్రమాలు జరిగాయంటూ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇంతవరకు ఒక్క అధికారిపై చర్యలు తీసుకోలేదు. గొర్రెల పంపిణీలో అక్రమాలపై ప్రభుత్వం వచ్చిన కొత్తలో కేసులు పెట్టి, ఆ తరువాత అటకెక్కించారనే విమర్శలు ఉన్నాయి. కనీసం మునిసిపల్ శాఖను ఇచ్చినా బాగుండేదని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు.

అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమంతో పాటు దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ శాఖలను అప్పగించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టి వెళ్లిన వాటికే ఇప్పటికీ ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కావడం లేదు. ఓవర్సీస్ స్కాలర్ షిప్, గురుకులాల భవనాల అద్దెలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయి. పేద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రజా ప్రతినిధులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఎప్పటికప్పుడు కోరుతున్నా, మొక్కుబడిగా కొద్దిగా విదిల్చి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీటితో పాటు ఒక ముఖ్యమైన శాఖను కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి వచ్చేదని మాదిగ కులం నాయకులు వ్యాఖ్యానించారు. మాదిగలంతా ఒకవైపు నిలబడి కాంగ్రెస్‌ను గెలిపించారని, ఆ కులం నుంచి వచ్చిన లక్ష్మణ్‌కు ప్రాధాన్యం, పేరు లేని శాఖలు ఇచ్చారని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ విస్తరణ తర్వాత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద విద్య, హోం, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖలు ఉన్నాయి. మళ్లీ మంత్రివర్గ విస్తరణ చేపట్టే వరకూ ఆ శాఖలను ముఖ్యమంత్రే పర్యవేక్షించనున్నారు.