రింగ్ రోడ్డు కాదు.. దొంగ రోడ్డు, అనుచరుల లబ్ధికోసమే మంత్రి కోమటిరెడ్డి ప్లాన్ 3 … మాజీ ఎమ్మెల్యే కంచర్ల స్పష్టీకరణ
నల్లగొండ రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో ప్రజల ఇండ్లు, భూములు కోల్పోయేలా చేస్తూ బాధితులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శించారు

విధాత : నల్లగొండ రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో ప్రజల ఇండ్లు, భూములు కోల్పోయేలా చేస్తూ బాధితులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శించారు. అది రింగ్ రోడ్డు కాదు..దొంగ రోడ్డు అని మంత్రి తన అనుచరులకు దోచి పెట్టడానికి ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. శుక్రవారం నల్లగొండ రింగ్ రోడ్ బాధిత కుటుంబాలతో కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిసి వారి సమస్యలపై వినతి పత్రం అందించారు. స్పందించిన కలెక్టర్ సి.నారాయణరెడ్డి తాను స్వయంగా స్థల పరిశీలన జరిపి ప్రభుత్వంతోనూ, ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న బాధితులతోను మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కంచర్ల భూపాల్‌రెడ్డి 3000 కుటుంబాల ప్రజలు కష్టపడి చమటోడ్చి… సంపాదించుకున్న ప్లాట్లు.. ఇండ్లు.. నష్ట పోతున్నా పట్టించు కోకుండా…అధికారం ఉందనే అహంకారంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొండి వైఖరితో రోడ్డు నిర్మాణానికి ముందుకెలుతున్నారని ఆరోపించారు. అందరికి ఆమోదయోగ్యమైన.. ప్లాన్ 1,2, వదిలేసి.. తమ అనుచరుల లబ్ధికోసం ప్లాన్ 3 ఎంచుకున్నారని ఆరోపించారు. తక్షణమే మంత్రి ప్లాన్ 3 ఉపసంహారించుకోవాలని.. లేకుంటే బాధితుల తరుపున తాము పోరాడుతామని ప్రకటించారు. 15 రోజుల సమయం ఇస్తున్నామని… ఈలోగా ప్లాన్ 3 ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే…ఎంతమంది బాధితులున్నారో వారందరితో కలిసి.. పాదయాత్ర చేస్తామని, ఆతర్వాత ఆ ఉత్తర్వులు రద్దు చేసేవరకు దశల వారీగా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రింగ్ రోడ్డు బాధితులతో పాటు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రెగట్టే మల్లిఖార్జున రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, కాంచనపల్లి రవీందర్ రావు, జమాల్ ఖాద్రి, కౌన్సిలర్ మారగోని గణేష్, మెరుగు గోపి, షంషుద్దీన్, గంజి రాజేందర్, వజ్జే శ్రీనివాస్, దొడ్డి రమేష్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.