జూలై 5వ తేదీన “కోల్ బెల్ట్ బంద్, ప్రైవేటు సంస్థలు దోపిడీ చేస్తాయి : సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్

సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కొత్త బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూలై 5వ తేదీన “కోల్ బెల్ట్ బంద్ నిర్వహించనున్నట్లు సిపిఐ, సింగరేణి గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎస్ ఎఐటియుసి అనుబంధం) ప్రకటించాయి.

  • Publish Date - June 26, 2024 / 07:34 PM IST

సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ..
15 రోజుల పాటు సిపిఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, నిరహార దీక్షలు, జిల్లా కలెక్టరేట్ ముట్టడి
బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా కేంద్రంతో రాష్ట్రం పోరాడాలి
బొగ్గు గనుల వేలం విషయంలో కేంద్ర మంత్రి కిషన్ అబద్దాలు
మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ కూనంనేని సాంబశివరావు
విధాత: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కొత్త బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూలై 5వ తేదీన “కోల్ బెల్ట్ బంద్ నిర్వహించనున్నట్లు సిపిఐ, సింగరేణి గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎస్ ఎఐటియుసి అనుబంధం) ప్రకటించాయి. సింగరేణి కార్మికుల ఉద్యమానికి మద్దతుగా కార్మికులతో కలిసి కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుంచి 15 రోజుల పాటు నిరసన ప్రదర్శనలు, నిరహార దీక్షలు, జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపాయి. హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ కూనంనేని సాంబశివరావు, కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజకుమార్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్ ఈ విషయాలను వెల్లడించారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేంగా కార్మికుల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బొగ్గు గనులు మనకు ఉంటాయని, కొత్త గనులు వస్తాయని, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తే పదేళ్ల బిఆరెస్ పాలనలో పూర్తిగా నిరాశే మిగిలిందన్నారు. సింగరేణిపై ఉద్యమ కాలంలో కేసీఆర్ ఇచ్చిన మాటకు భిన్నంగా వ్యవహరించారని విమర్శించారు. 2015లో ఎంఎంఆర్ చట్టం ద్వారా బొగ్గు గనులు రాష్ట్రం చేతుల్లో లేకుండా పోయాయని, తద్వారా అదానీ, అంబానీలకు బొగ్గు గనులను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని, అందుకు అప్పటి సిఎం కెసిఆర్ సహకరించారని కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎంఆర్ చట్టానికి వ్యతిరేకంగా కెసిఆర్ కనీసం నోరు విప్పలేదని, నిరసన వ్యక్తం చేయలేదని, సింగరేణి పరిరక్షించకుండా కేంద్రానికి రాసిచ్చిందని, ఇందుకు కెసిఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ చేసిన పాపానికి సింగరేణి ప్రమాదంలో పడిందన్నారు. ఇప్పటికే కోయలగూడెం తదితర కొన్ని గనులను ప్రైవేటీకరించారన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ వల్ల బొగ్గు ఖరీదు విపరీతంగా పెరిగిపోయి బొగ్గు ఆధారిత పరిశ్రమలకు తీవ్ర నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా కేంద్రంతో రాష్ట్రం పోరాడాలి
బొగ్గు గనుల వేలం విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యంగా ఉండాలని, ప్రజల అభిష్టానికి అనుగుణంగా వ్యవహరించాలని, కేంద్రంతో పోరాడాలని కూనంనేని సాంబశివరావు పిలుపు ఇచ్చారు. బొగ్గు గనుల వేలం విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయంలో ఉందని, వేలంలో పాల్గొంటే సింగరేణికి వస్తాయో రావో తెలిదని, పాల్గొనకుంటే గనులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, అయితే ప్రజల అభిష్టానికి అనుగుణంగావ్యవహరించాలన్నారు.
గనుల విషయంలో కిషన్ అబద్దాలు
సింగరేణి పరిరక్షణ, బొగ్గు గనుల వేలంపాట విషయంలో ఇటివల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన కిషన్ అబద్దాలు చెప్పారని, తెలంగాణ ప్రజలను మోసం చేశారని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయబోమని హామీ ఇచ్చిన మంత్రి కిషన్ సింగరేణి పరిధిలోని గనుల వేలం పాటకు తెరలేపడం దుర్మార్గమన్నారు. తాజాగా కొత్త బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించే ప్రధాని మోదీ కుట్ర లో మంత్రి కిషన్ భాగస్వామ్యం అయ్యారని అన్నారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన బొగ్గు గనుల లీజు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించినందుకు కిషన్ సిగ్గుపడాలన్నారు.
ప్రైవేటు సంస్థలు దోపిడీ చేస్తాయి
అజీజ్ మాట్లాడుతూ బొగ్గు గనులను నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కార్మికుల సంక్షేమంతో పాటు వారి 34 వేల మంది పిల్లలకు విద్యాభ్యాసాన్ని అందిస్తుందని, 45 వేల మందికి సామాజిక సేవలను అందిస్తుందని, గనులను ప్రైవేటీకరిస్తే ప్రైవేటు సంస్థలు వారి లాభాల గురించి తప్ప సంక్షేమాన్ని పట్టించుకోవని తెలిపారు. పైగా గనులలో కార్మికులను దోపిడీ చేస్తారన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిలిపివేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు.
కొత్త గనులు సింగరేణి ఇవ్వాలి
సింగరేణి సంస్థ కోట్లాది రూపాయలను ఖర్చు చేసి బొగ్గు నిక్షేపాలను కనుగొంటే వాటిని ప్రభుత్వాలు వేలం వేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించడం దుర్మార్గమని వాసిరెడ్డి సీతారామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో కోయలగూడెం, సత్తుపల్లి బొగ్గు గనుల వేలంపాటలో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం సింగరేణిని పాల్గొనవద్దని చెప్పి రెండు గనులు అరవిందో, అవంతి సంస్థలు దక్కించుకునే విధంగా కుట్ర చేశారని ఆయన విమర్శించారు. గతంలో వేలం వేసిన కోయలగూడెం, సత్తుపల్లి గనుల లీజును రద్దు చేయాలని, వాటితో పాటు కొత్త గనులను కూడా సింగరేణికి ఇవ్వాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గును గ్రేడ్ బట్టి టన్ను బొగ్గును రూ.2500 నుంచి రూ.4000 లకు విక్రయిస్తుండగా, అదానీ సంస్థలు రూ.19000 నుంచి రూ.21000 లకు టన్ను బొగ్గును అమ్ముతున్నారని, ఫలితంగా బొగ్గు ఆధారిత పరిశ్రమలు చేసే ఉత్పత్తుల ధరలు కూడా గణనీయంగా పెరుగతాయని ఆయన హెచ్చరించారు.

Latest News