ఎంసీహెచ్‌ఆర్డీలోనే సీఎం క్యాంపు ఆఫీస్‌

సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు ఆఫీస్ ఎంపిక అన్వేషణ అటు ఇటు తిరిగి మళ్లీ ఎంసీహెచ్‌ఆర్డీలోనే ఆగిందని సమాచారం

ఎంసీహెచ్‌ఆర్డీలోనే సీఎం క్యాంపు ఆఫీస్‌
  • క్యాంపు ఆఫీస్‌గా పాయ్‌గా ప్యాలెస్ పరిశీలన
  • రాజభవనాలు వద్దన్న ఆలోచనలో రేవంత్‌రెడ్డి

విధాత : సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు ఆఫీస్ ఎంపిక అన్వేషణ అటు ఇటు తిరిగి మళ్లీ ఎంసీహెచ్‌ఆర్డీలోనే ఆగిందని సమాచారం. బేగంపేటలోని పాయ్‌గా ప్యాలేస్‌ను సీఎం క్యాంపు కాఫీస్‌గా వినియోగించడానికి అనుకూలంగా ఉందని అధికార యంత్రాంగం నివేదిక సమర్పించింది. అయితే సీఎంగా తాను పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే గత బీఆరెస్ ప్రభుత్వం సాగించిన గడీల సంస్కృతికి చరమగీతం పాడి, ప్రగతి భవన్ కంచెలు తొలగించి ప్రజాభవన్‌గా నామకరణం చేసిన ప్రజాపాలన సాగిస్తున్న నేపధ్యంలో మళ్లీ రాచరిక చిహ్నంగా ఉండే పాయ్‌గా ప్యాలేస్‌లో క్యాంపు ఆఫీస్ పెట్టుకోవడం సరికాదన్న ఆలోచనతో ఎంసీహెచ్‌ఆర్డీలోనే క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు అనువైందన్న నిర్ణయానికి రేవంత్‌రెడ్డి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో సీఎం క్యాంపు ఆఫీస్ కోసం ఎంసీహెచ్‌ఆర్డీలో చేపట్టిన తాత్కాలిక నిర్మాణ పనులు పూర్తి కానే రేవంత్‌రెడ్డి అందులోకి మారుతారని సమాచారం.

ప్యాలేస్‌ను సూచించిన అధికారులు

బేగంపేటలోని పాయ్‌గా ప్యాలేస్‌ను సీఎం క్యాంపు కాఫీస్‌గా వినియోగించే విషయమై అధికార యంత్రాంగం కసరత్తు చేసి రేవంత్‌రెడ్డికి నివేదిక ఇచ్చింది. సచివాలయానికి దగ్గరగా, నగరం నడిబొడ్డున ఉన్న ఈ పాయ్‌గా ప్యాలెస్‌ నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి సచివాలయానికి రాకపోకలు సాగించడంలో పెద్దగా ట్రాఫిక్‌ ఇబ్బంది ఉండదన్న ఆలోచనతో దీనిని సీఎం క్యాంపు ఆఫీస్‌గా మార్చే విషయమై అధికారులు మొగ్గు చూపారు. ఇప్పటికే సీఎస్‌ శాంతికుమారి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌ సహా పలు శాఖల అధికారులు పాయ్‌గా ప్యాలెస్‌ను సందర్శించి సీఎం క్యాంపు కార్యాలయంగా ప్యాలెస్‌ను వినియోగించేందుకు ఎంత వరకు అనుకూలంగా ఉందన్న అంశాలను పరిశీలించారు. పాయ్‌గా ప్యాలెస్‌ నుంచి ఐదు నిమిషాల్లో మినిస్టర్‌ రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా, లేక మినిస్టర్‌ రోడ్డు నుంచి నెక్లెస్‌ రోడ్డు, ఎన్‌టీఆర్‌ మార్గ్గ్‌ మీదుగా ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా సచివాలయానికి సీఎం రాకపోకలు సాగించవచ్చు. అలాగే ప్యాలెస్‌ చుట్టు పక్కన నివాసాలు కూడా లేకపోవడంతో సందర్శకులతో ఎవరికి ఇబ్బంది కూడా ఉండదని అధికారులు భావించారు.


తొలుత జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నా రెడ్డి ఇనిస్టిట్యూట్ లో సీఎం క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేయాలని అధికారులు భావించినా జన సముదాయాల్లో క్యాంపు కార్యాలయం ఉంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయన్న ఆలోచనతో అధికారులు ప్రత్యామ్నాయంగా హెచ్‌ఎండీఏ వారసత్వ కట్టడంగా ఉన్న పాయ్‌గా ప్యాలెస్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. అయితే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రాచరిక భవనాల్లో ఉండటానికి విముఖత వ్యక్తం చేసి అధికారుల ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తుంది.

శతాబ్ధం గడిచినా వన్నె తగ్గని పాయ్‌గా ప్యాలెస్‌

ఆరో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలిఖాన్‌ వద్ధ ప్రధానిగా వ్యవహరించిన నవాబ్‌ వికారుల్‌ ఉమ్రా 1900సంవత్సరంలో చిరాన్‌లేన్‌లోని 4ఎకరాల విస్తీర్ణంలో పాయ్‌గా ప్యాలెస్‌ను నిర్మించారు. పాయ్‌గా వంశీస్తుడైన ఆయన పేరు మీద దీనిని పాయ్‌గా ప్యాలెస్‌ అని పిలుస్తున్నారు. యూరోపియన్‌ శైలీలో రెండస్తులతో ఈ భవనం నిర్మితమైంది. మొదటి అంతస్తులో 20గదులున్నాయి. ప్యాలేస్‌కు 22అడుగుల ఎత్తైన డోమ్‌ పై కప్పు ఉంది. రెండో అంతస్తులో కలపతో చేసిన మెట్లు ఏర్పాటు చేశారు. భారత యూనియన్‌లో హైద్రాబాద్‌ సంస్థానం విలీనం అనంతరం పాయ్‌గా ప్యాలెస్‌ను హుడా కార్యాలయంగా వినియోగించారు. అనంతరం 2008లో అప్పటీ సీఎం వైఎస్సార్‌ అమెరికా కాన్సూలెట్‌ కార్యాలయానికి కేటాయించారు. అమెరికా కాన్సులెట్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌లో కొత్త భవనం నిర్మించుకుని తరలిపోయాక గత ఏడాది ఏప్రిల్‌లో తిరిగి ఈ ప్యాలెస్‌ హెచ్‌ఎండీఏ ఆధీనంలోకి వచ్చింది. ప్రస్తుతం పాయ్‌గా ప్యాలెస్‌ ఖాళీగా ఉంది. దీనిని సీఎం కార్యాలయంగా వినియోగించేందుకు భవనం లోపల, వెలుపల తీసుకోవాల్సిన సదుపాయాలపై అధికారులు దృష్టి సారించి అందుకోసం నివేదిక సిద్ధం చేశారు. సీఎం మాత్రం ఎంసీహెచ్‌ఆర్డీలోనే క్యాంపు ఆఫీస్‌కు సానుకూలత చూపారు.