Prabhakar Rao Phone Tapping Case | ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ తీర్పుపై ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపు

ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు 22న తీర్పు ఇవ్వనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు రానుంది.

Prabhakar Rao Phone Tapping Case | ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ తీర్పుపై ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అప్పటి ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈ నెల 22న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా దర్యాప్తు సంస్థ సిట్ ఆయనపై తదుపరి చర్యలకు సిద్దమవుతుంది. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం ప్రభాకర్ రావుపై నెల రోజుల్లో అడిషనల్ చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిట్ సిద్దమవుతుంది. ఇప్పటికే సిట్ ప్రభాకర్ రావు ను 10సార్లు విచారించింది. ఐదుగురు సాక్షలతో కలిపి ప్రభాకర్ రావును ప్రశ్నించింది.

బీఆర్ఎస్ హయాంలో అప్పటి పాలకుల అవసరాలకు అనుగుణంగా ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపార వేత్తలు, జడ్జీలు, జర్నలిస్టులు, సెలబ్రేటీలు ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. గత ఏడాది మార్చి 10న కేసు నమోదైంది. కేసులో మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణిత్ రావు, డీసీపీ రాధాకృష్ణరావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్నలను సిట్ అరెస్టు చేసి విచారించింది. కేసు నమోదైన మరుసటిరోజే ప్రధాన నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అప్పటికే అమెరికా వెళ్లిపోయారు. ప్రభాకర్‌రావు మార్చి 11నే అమెరికాకు వెళ్లారు. శ్రవణ్‌రావు మార్చి 20న అమెరికా వెళ్లారు. అతికష్టం మీద వారిద్దరిని తిరిగి ఇండియాకు రప్పించిన సిట్ విచారణలో తమ తప్పేది లేదంటు వాదించారు.

కేసు విచారణలో ప్రభాకర్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా పరికరాలను కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఇజ్రాయెల్ నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఈ పరికరాల దిగుమతికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి కూడా తీసుకోలేదని దర్యాప్తు అధికారుల బృందం గుర్తించింది. దీనిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో 600కుపైగా బాధితులతో కూడిన ఓ జాబితాను రూపొందించిన సిట్ దాదాపు 300 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసింది. 4200లకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2023 నవంబర్‌ 15 నుంచి 30 మధ్యే ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ఎస్‌ఐబీ 4,013 ఫోన్లపై నిఘా ఉంచినట్లు సిట్‌ గుర్తించిన సంగతి తెలిసిందే. వీటిలో 618 రాజకీయ నాయకులకు సంబంధించినవిగా తేల్చింది. ప్రభుత్వం మారిన వెంటనే ప్రభాకర్‌రావుతో పాటు ఆయన టీమ్‌ మొత్తం తమ ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్‌ చేయడంతో పాటు ఫోన్లను, హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసింది. అయితే ప్రణీత్‌ రావు సంబంధించిన ఓ ఫోన్‌లో మాత్రం డేటా డిలీట్‌ కాకపోవడంతో అది సిట్‌ చేతికి చిక్కి దర్యాప్తులో కీలకంగా మారింది.