అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు

- ఇది నిరంకుశ ప్రభుత్వం
- నోటిఫికేషన్లు ఇమ్మంటే అరెస్టులు
- జనం బాధలు చెప్పుకొనే వీలేది?
- ఇది ప్రజాస్వామిక తెలంగాణ కాదు
- మంత్రులందరూ నామమాత్రమే
- అన్నీ చేసేది ముఖ్యమంత్రి ఒక్కరే
- కాళేశ్వరం తిప్పిపోతల పథకం
- ఆంధ్ర కాంట్రాక్టర్లకే ప్రాజెక్టులు
- తెలంగాణ వనరులు మళ్లీ దోపిడీ
- తెలంగాణ గెలవాలనే కాంగ్రెస్‌కు మద్దతు
- విధాత ఇంటర్వ్యూలో కోదండరాం
విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆరెస్ ప్రభుత్వం నిరంకుశంగా పాలిస్తున్నదని, అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డంగా దోచుకుంటున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు తమ బాధలు చెప్పుకొనే అవకాశం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము భౌగోళిక తెలంగాణ వస్తే చాలనుకోలేదని, ప్రజాస్వామిక తెలంగాణ రావాలని కోరుకున్నామని తెలిపారు. కానీ.. భౌగోళికంగా రాష్ట్రం ఏర్పడినా.. ప్రజాస్వామిక తెలంగాణ దిశగా పురోగతి లేదన్నారు. ఆ దిశగా నడిపించే ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు. విధాతకు ఆయన ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక కీలక అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఏ ఆందోళన చేసినా అరెస్టులే
రాష్ట్రంలో ఏ ఆందోళన చేసినా.. అరెస్టు చేస్తున్నారని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మల్లన్న సాగర్ ఇంత పెద్దగా అవసంలేదు.. రిజర్వాయర్ కోసం తప్పని సరిగా భూమి కావాలంటే 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వండి అంటే.. ఆ చట్టాన్ని తుంగలో తొక్కింది. అప్పుడు ప్రజలు రోడ్లమీదకు వస్తే 144 సెక్షన్ విధించి, కొట్టారు. ఉద్యోగాలకు క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వాలని ఊరేగింపు తీస్తమంటే మా ఇంటి తలుపులు పగులగొట్టి మమ్ముల్ని అరెస్ట్ చేశారు. ఆర్మూర్ రైతులు తమకు ఒక్క టీఎంసీ నీటిని వదలండి.. పంటలు కాపాడుకుంటామంటే.. 144 సెక్షన్ విధించి, ఇండ్లపై దాడులు చేసి మరీ కొట్టారు. కార్యాచరణ కోసం దరఖాస్తు చేసుకుంటే పర్మిషన్ ఇవ్వరు. ఇంటిదగ్గర హౌజ్ అరెస్ట్‌లే చేశారు. ఇది దాదాపు అందరికీ అనుభవం అయింది. నిరసన తెలిపితే కేసులు పెట్టింది. కాంట్రక్ట్ ఉద్యోగులందరినీ తీసి వేసే ప్రయత్నం చేస్తే, తమను క్రమబద్ధీకరించాలని ఆందోళన చేస్తే చిన్న పిల్లల తల్లులను అరెస్ట్ చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామిక హక్కులు లేవు, నిరంకుశమైన పాలన కొనసాగుతున్నది’ అని ఆయన చెప్పారు.
కాళేశ్వరం తిప్పిపోతల పథకం
కాళేశ్వరం ప్రాజెక్టు తిప్పిపోతల పథకంగా మారిందని కోదండరాం విమర్శించారు. ముఖ్యమంత్రి తనకు ఏది ఆలోచన వస్తే అదే చేస్తారని చెప్పారు. కాళేశ్వరం డిజైన్ సరికాదని చెప్పినా వినకుండా నిర్మించారని అన్నారు. ఆయనే ఇంజినీర్ అయి, ఫైనల్ చేశారని, వేగంగా నిర్మించాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లే మేడిగడ్డ బరాజ్ కుంగిందని కోదండరాం విమర్శించారు. ఈ ప్రాజెక్టుపై పెట్టిన వేల కోట్ల రూపాయలను స్కూళ్లకు, దవాఖానలకు ఉపయోగిస్తే పిల్లలకు మంచి చదువు, ప్రజలకు మంచి వైద్యం అందేదని అన్నారు. వాటిని తుంగలో తొక్కి.. కాంట్రాక్టర్ల కోసం డిజైన్ చేసి, కాంట్రాక్టర్లను బతికించాల్సిన అవసరమేంటని నిలదీశారు. రూ. 75 వేల కోట్ల నుంచి 80 వేల కోట్ల అంచనా వ్యయాన్ని రూ.1.87 లక్షల కోట్లకు పెంచారని కోదండరాం ఆరోపించారు. అంచనా వ్యయం 141 శాతం పెంచారని, ఇంతగా పెంచడం ఎక్కడా చూడలేదని అన్నారు. ఇంజినీరింగ్ నిపుణులతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకొనడం రాజ్యాంగ విరుద్దమని కోదండరాం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని విమర్శించారు. మేడిగడ్డ విషయంలో తప్పులు కప్పిపుచ్చి, దబాయించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కావడానికి ప్రభుత్వానిదే బాధ్యతని స్పష్టం చేశారు. నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని అన్నారు. దీనితోపాటు.. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డంగా దోచుకోవడం ప్రభుత్వ రెండో చెడ్డ లక్షణమని అన్నారు. ఈ రెండింటినీ జాగ్రత్తగా అర్థంచేసుకుంటే ప్రభుత్వ స్వభావం తెలుస్తుందని చెప్పారు. విచ్చలవిడి అధికారాలు చేజిక్కించుకున్న ఒక వ్యక్తి.. అన్నీ తానై ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ఆయనే ఇంజినీర్, ఆయనే ఎలక్ట్రీషియన్, ఆయనే లాయర్.. ఆయనే అన్ని మంత్రిత్వ శాఖలు నడుపుతున్నారని విమర్శించారు. బీఆరెస్ ప్రభుత్వంలో మంత్రులు నామమాత్రమేనని చెప్పారు.
బీఆరెస్ ప్రభుత్వంతో నష్టం
బీఆరెస్ పరిపాలన కొనసాగితే తెలంగాణకు నష్టమని కోదండరాం తేల్చి చెప్పారు. మళ్లీ బీఆరెస్ వస్తే పురోభివృద్ధి ఉండదని, ప్రజలకు బతుదెరువును చూపదని అన్నారు. మాత్రం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని, రాష్ట్రం ఆర్థికంగా సంపూర్ణంగా క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు మూడేళ్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మూడేళ్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు. పైరవీకారులకు తప్ప మిగిలినవారు బిల్లులు పొందటానికి ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిచయాలు లేని వారు కాంట్రాక్ట్‌ను వదిలేసుకున్నారని తెలిపారు. సంక్షోభానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలని ప్రశ్నించారు. భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడపాల్సిన దుస్థితి నెలకొన్నదని చెప్పారు.
సీఎంతో అక్కడే తేడా వచ్చింది
ఛత్తీస్‌గఢ్‌తో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్‌ను ప్రశ్నించినందుకు, ఏటా వెయ్యి కోట్ల నష్టం వస్తుందని చెప్పినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై కక్ష పెట్టుకున్నారని కోదండరాం తెలిపారు. ఆ సొమ్ము ఒకరిద్దరు ప్రధాన నాయకులకు పోతాయని తనకేం తెలుసని అన్నారు. అందుకే.. ఒప్పందం బాగో లేదని చెబితే.. నోటికాడ ముద్దను నేను కొట్టినట్టు భావించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూడా వాళ్ల ఆదాయాల కోసమే డిజైన్ చేసుకున్నారని ఆరోపించారు. అందరిలా కళ్లుమూసుకుని, ప్రశ్నించకుండా ఉంటే.. తాను కేసీఆర్‌కు దగ్గరగానే ఉండేవాడినని తెలిపారు. కేసీఆర్‌కు బాగుందని చప్పట్లు కొట్టేవారే కావాలని కోదండరాం చెప్పారు.
కాంగ్రెస్‌కు మద్దతు అందుకే
రాజకీయాల్లో మార్పు రాకుండా ప్రయోజనం ఉండదని గుర్తించే టీజేఏసీని తెలంగాణ జనసమితిగా ఏర్పాటు చేశామని కోదండరాం తెలిపారు. బీఆరెస్ నిరంకుశ పాలనను అంతమొందించాలనే కాంగ్రెస్‌కు మద్దతు తెలిపామన్నారు. 13 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావించామని, పొత్తులో ఒకటి రెండు చోట్ల గెలిచే అవకాశం ఉండేదేమోనని చెప్పారు. కానీ.. తెలంగాణ గెలవాలి.. ఉద్యమ ఆకాంక్షలకు అవకాశం దక్కాలని భావించే కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించామని తెలిపారు. అన్నింటి కంటే కేసీఆర్ చేసింది తప్పు అని చెప్పడానికి, ప్రజల ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యం, పార్టీ ప్రయోజనాలకు రెండో ప్రాధాన్యం ఇచ్చి.. బీఆరెస్ నిరంకుశ పాలన అంతమొందించడం కోసం కాంగ్రెస్‌కు మద్దతిచ్చామని స్పష్టం చేశారు.