Revanth Reddy | మేడారంలో రేవంత్ కేబినెట్ భేటీ.. ఎజెండా ఇదే..!
Revanth Reddy | రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ కేబినెట్ భేటీ.. రాజధాని నగరం వెలుపల జరగనుంది. రెండేండ్లకో సారి గొప్పగా నిర్వహించే మేడారం జాతరలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది.
Revanth Reddy | హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ కేబినెట్ భేటీ.. రాజధాని నగరం వెలుపల జరగనుంది. రెండేండ్లకో సారి గొప్పగా నిర్వహించే మేడారం జాతరలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఆదివారం సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి సీతక్క దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. సీఎం రాక నేపథ్యంలో మేడారంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు.
కనీవినీ ఎరుగని రీతిలో అత్యద్భుతంగా చేపట్టిన మేడారం ఆలయ అభివృద్ధి పనులను సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. రాతి కట్టడాలతో వందల ఏళ్లయినా చెక్కు చెదరని రీతిలో 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాకార నిర్మాణం చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్కలు పలుమార్లు అధికారులతో సమీక్షలు చేసి రూ.101 కోట్లతో చేపట్టిన పనులను పరుగులెత్తించారు.
కేబినెట్ ఎంజెడా ఇదే..
మేడారంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దాదాపు 13 నుంచి 15 కు పైగా అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. కేబినెట్ ఎజెండాలో రెవెన్యూ శాఖ నుంచి 5, మున్సిపల్ శాఖ నుంచి 2, ఆర్థికశాఖ నుంచి 3, ఇరిగేషన్ శాఖ నుంచి మరికొన్ని సబ్జెక్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది.
రెవెన్యూ శాఖ నుంచి వచ్చే ఫైళ్లలో భూ కేటాయింపులు, ఆర్థికశాఖ నుంచి 3 క్రియేషన్ ఆఫ్ పోస్టుల దస్త్రాలు ఉన్నట్లు సమాచారం. వీటిలో చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఒకటి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో ఒకటి, ఫార్మసీ కాలేజీలో మరొకటి చొప్పున మొత్తం 3 ప్రొఫెసర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది. ఇవికాక, ఎంఏయూడీ నుంచి మునిసిపల్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై స్టేటస్ నోట్లు క్యాబినెట్ ముందుకు రానున్నట్లు వినికిడి. అదే సమయంలో, ట్రాన్స్ జెండర్లకు ఒక్కో మునిసిపల్ కార్పొరేషన్లో ఒక్కో కో ఆప్షన్ మెంబర్ నియామకానికి అవకాశం కల్పించే చట్ట సవరణతో కూడిన ఆర్డినెన్స్ ముసాయిదా బిల్లు మంత్రివర్గం ముందుకు రానున్నట్లు వినికిడి.
ఇక, ఇరిగేషన్ శాఖ నుంచి చిన్న కాళేశ్వరం [ముక్తేశ్వర] ఎత్తిపోతల ప్రాజెక్టు సవరించిన అంచనాల ఫైల్ కూడా క్యాబినెట్ ముందుకు రానుంది. ఇదికాక, మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా సాధన, నిర్వహణ కోసం నిధుల మంజూరు అంశాలపై మంత్రివర్గం చర్చ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు రైతు భరోసా చెల్లింపులు, వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన, ఇతర సమకాలీన విషయాలపై కూడా క్యాబినెట్ దృష్టిసారించే అవకాశం ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram