రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కావచ్చు.. కాని ఎన్నటికీ తెలంగాణ ఉద్యమకారుడు కాలేడని బీఆరెస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
విధాత : రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కావచ్చు.. కాని ఎన్నటికీ తెలంగాణ ఉద్యమకారుడు కాలేడని బీఆరెస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా బీఆరెస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహీగానే రేవంత్‌రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడే తప్ప.. ఏనాటికీ ఉద్యమకారుడు కాలేడని విమర్శించారు.
ఉద్యమకారులన్న ఘనత బీఆరెస్ వారికే దక్కుతుందని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్, బీఆరెస్ శ్రీరామ రక్ష అని, కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని ఖతం చేస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ హక్కుల కోసం, ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆరెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. నాడు సమైక్య పాలనలో తెలంగాణ పదాన్ని నిషేదించారని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ఇచ్చి రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల ప్రకటనల్లోనూ జై తెలంగాణ అని ఎక్కడా లేదన్నారు.
రేవంత్ ప్రభుత్వ ప్రకటనల్లో కానరాని జై తెలంగాణ
ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పదం మాయమైందని విమర్శించారు. కేసీఆర్, బీఆరెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం స్వరాష్ట్ర పోరాటం చేశామని గుర్తు చేశారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన జిల్లా నేతలను గౌరవించుకోవాలని బీఆరెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి నిర్ణయించడం హర్షనీయమని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో ప్రతి ఒక్కరూ ఉద్యమకారులే అని.. ప్రతి ఒక్కరినీ సన్మానించుకోవాలని తెలిపారు.