విధాత : తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వర జాతర బుధవారం వేలాది భక్తుల రద్దీతో ఘనంగా ప్రారంభమైంది. ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి మూడు రోజులపాటు సలేశ్వరం జాతర కొనసాగనుంది. చెంచుల ఆరాధ్యదైవమైన లింగమయ్యను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. ఘాట్ రోడ్డు కావడంతో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మన్ననూరు నుంచి ఫర్హాబాద్ చౌరస్తా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అటవీ, పోలీస్ సిబ్బంది తిప్పలు పడుతున్నారు.
అడవి..కొండలు.. లోయల మధ్య కొలువైన సలేశ్వరుడు
దట్టమైన అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో ఎత్తైన కొండల నుంచి జాలువారే అందమైన జలపాతానికి దిగువన వెయ్యి అడుగుల లోయలో కొలువైన పురాతన దేవాలయమే ఈ సలేశ్వర క్షేత్రం. సలేశ్వర క్షేత్రానికి ఎదురుగా ఉన్న ఎత్తైన కొండపై నుంచి జాలువారే జలపాతాలు భక్తులను ఆకట్టుకుంటాయి.
పురాతన కాలం నుంచి లింగమయ్య ఆలయంలో పూజలన్నీ అనాదిగా చెంచు పెద్దలే నిర్వహిస్తారు. సలేశ్వరం యాత్ర ఎక్కువ భాగం అటవీ ప్రాంతం నుంచే ప్రయాణం చేయాల్సిన నేపథ్యంలో.. అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం ఫర్హాబాద్ నుంచి పుల్లయపల్లి, రాంపూర్ చెంచు పెంటల మీదుగా సుమారుగా 20 కిలో మీటర్లు వాహనాల్లో ప్రయాణం సాగించాలి. అక్కడ నుంచి కొండలు, రాళ్లను దాటుకుంటూ 4 కిలో మీటర్లు కాలినడక, దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలు ఎక్కి, దిగితూ ఎత్తైన జలపాతం దిగువన సలేశ్వరం క్షేత్రంకు చేరుకోవచ్చు. అక్కడే కొండల నడుమ వెలసిన స్వామివారిని చేరుకుని దర్శించుకుని తిరుగు పయనమవ్వాలి. దారి పొడవునా వన్యమృగాల సంచారం ఉన్నప్పటికీ, ఆ ఈశ్వరుడిపై భారమేసి భక్తులు ముందుకు సాగుతుంటారు. హైదబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం వెళ్లే బస్సుల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చారు. ఎంజీబీఎస్‌లో బస్సు ఎక్కి ఆమ్రాబాద్ ఫారెస్ట్ వద్ద దిగితే అక్కడ్నుంచి సలేశ్వరి దగ్గరి వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
సలేశ్వర లింగమయ్య దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది పులుల అభయారణ్యం కావడంతో అటవీ శాఖ కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. పర్యావరణానికి హాని కలగకుండా, వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా యాత్రను ముగించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సలేశ్వరం జాతర అధ్యంతం పర్యాటకుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. చెట్లపై పక్షుల కిలకిల రావాలు.. కొండల మధ్యలో నుంచి జాలువారే జలపాతాలు, దాట్టమైన అడవిలో కనిపించే అటవీ జంతువులు కనువిందు చేస్తూ భక్తులను మరింతగా పరవశింపజేస్తాయి. ఓ రకంగా ఇది ట్రెక్కింగ్ తో కూడిన సాహసయాత్రగా కూడా మంచి అనుభూతిని అందిస్తుంది.
