Panchamukha Anjaneya Swamy | ఈ వేగమైన జీవితంలో.. మనం ఎదుర్కొనే సమస్యలకు ఒక్కోసారి మనసుకు ఓ ఆధారం కావాలి. అలాంటి సమయంలో.. భక్తికి ప్రతీకగా నిలిచే పంచముఖ ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.. భక్తి మాత్రమే కాదు, ఇందులో ఉన్న శక్తి కూడా ఎంతో ప్రత్యేకం!
రామాయణంలో ఉన్న అద్భుత గాథ..
రామ-రావణ యుద్ధంలో.. రావణుడు మహీరావణుడి సహాయం కోరుతాడు. పాతాళానికి అధిపతైన మహీరావణుడు.. విభీషణుడి రూపంలో వచ్చి శ్రీరాముడు, లక్ష్మణుడిని అపహరిస్తాడు. అది తెలుసుకున్న ఆంజనేయుడు.. వారిని రక్షించడానికి పాతాళానికి వెళ్తాడు. అక్కడ ఒక గూఢరహస్యం తెలుసుకుంటాడు-ఐదు దిక్కుల్లో వెలిగే ఐదు దీపాలను ఒకేసారి ఆర్పితేనే మహీరావణుడు నశిస్తాడని!
అప్పుడే ఆంజనేయుడు.. ఒక అద్భుత రూపం ధరించాడు – అదే పంచముఖ ఆంజనేయ స్వామి! హనుమంతుడు, గరుడుడు, వరాహం, నరసింహం, హయగ్రీవం.. ఐదు ముఖాలతో ఒకే సమయంలో ఆ దీపాలను ఆర్పి.. శ్రీరామలక్ష్మణులను కాపాడాడు.
పంచముఖాల గొప్పతనం – ఐదు దిక్కులు, ఐదు శక్తులు!
తూర్పు – హనుమంతుడు
పాపాలను తొలగించి.. మనసుకు ప్రశాంతత ఇస్తాడు. కష్టాల నుంచి రక్షణ కల్పిస్తాడు.
దక్షిణ – నరసింహ స్వామి
శత్రు భయాన్ని తొలగించి.. విజయాన్ని అందిస్తాడు. చెడు శక్తుల నుండి కాపాడుతాడు.
పడమర – గరుడ స్వామి
దుష్ట ప్రభావాలు, విష ప్రభావాల నుండి రక్షణ.. ఆరోగ్యాన్ని కాపాడే శక్తి.
ఉత్తరం – వరాహ స్వామి
గ్రహ దోషాలను తొలగించి.. అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. జీవితంలో స్థిరత్వం తీసుకొస్తాడు.
ఊర్ధ్వ – హయగ్రీవ స్వామి
జ్ఞానం, విజయాలు, మంచి కుటుంబ జీవితం, సంతానం – ఆశీర్వాదం!
ఇంట్లో ఫోటో ఉంచితే కలిగే ఫలితాలు..
పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరమవుతుందని, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. కుటుంబంలో శాంతి, సుఖసంపదలు పెరుగుతాయని, చెడు ప్రభావాల నుండి రక్షణ లభిస్తుందని విశ్వాసం.
ప్రత్యేకంగా చేయాల్సినవి..
శని, మంగళవారాల్లో తమలపాకుల మాల, వెన్న సమర్పిస్తే.. ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం ‘శ్రీరామజయం’ మంత్రాన్ని 108 సార్లు రాసి మాలగా సమర్పిస్తే.. అనుకున్న పనులు సఫలమవుతాయని విశ్వాసం.
భక్తి ఉంటే చాలు.. ఆంజనేయుడు ఎక్కడైనా ఉంటాడని పండితులు చెబుతారు. అలాంటి మహిమ కలిగిన పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో.. మీ ఇంట్లో ఉందా?
