Dragon | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా డ్రాగన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ను మరోసారి షేక్ చేస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ‘వార్ 2’ తర్వాత ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌తో తన మాస్ స్టామినా చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం తారక్ తన లుక్, ఫిజిక్‌ను పూర్తిగా మార్చుకున్నట్లు సమాచారం. నీల్ మార్క్ డార్క్ టోన్, భారీ యాక్షన్ ఎలివేషన్స్‌కు ఎన్టీఆర్ ఎనర్జీ కలిస్తే రికార్డుల వర్షం కురుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మలయాళ స్టార్ టోవినో థామస్ నటిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించడం సంచలనంగా మారింది. తన తాజా చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన టోవినో, తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. తెలుగు సినిమాల్లో నటించాలని నాకు చాలా ఇష్టం. కానీ మలయాళ సినిమా, టాలీవుడ్ పని తీరు చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువ కాలం సాగుతాయి. నేను ఒకేసారి అనేక ప్రాజెక్ట్స్ చేయలేను. ఈ సినిమా కోసం ఎక్కువ కాలం కేటాయిస్తే, నేను కమిట్ అయిన ఇతర సినిమాలపై ప్రభావం పడుతుంది అని చెప్పారు.
అలాగే, కేవలం విలన్ పాత్ర కోసం తన చేతిలో ఉన్న లీడ్ రోల్స్ వదులుకోవడం రిస్క్‌గా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతేడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఒక చిన్న షెడ్యూల్ అనంతరం, స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరిచేందుకు ప్రశాంత్ నీల్ దాదాపు ఆరు నెలల విరామం తీసుకున్నారు. దీంతో షూటింగ్ షెడ్యూల్స్ మారిపోయాయి. ప్రస్తుతం చిత్రబృందం మళ్లీ షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అయితే టోవినో తప్పుకోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్‌కు సరితూగే విలన్ ఎవరు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. టోవినో థామస్ స్థానంలో మరో స్టార్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. నీల్ సినిమాల్లో విలన్ పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో తెలిసిందే కాబట్టి, ఈ క్యాస్టింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఇక డ్రాగన్ ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే అవకాశముంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
