Buchi Babu | దర్శకుడు బుచ్చిబాబు స‌న‌ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ఆయన తెరకెక్కించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు, విశ్లేషకులు బుచ్చిబాబు పనితనం గురించి చర్చించుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతుండటంతో దర్శకుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

‘పెద్ది’కి ముందు బుచ్చిబాబు తెరకెక్కించిన తొలి చిత్రం ఉప్పెన‌. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. అదే సమయంలో హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. విడుదలైన వెంటనే ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుని వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఒక్క సినిమాతోనే బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు.

ఎన్టీఆర్‌తో మొదలైన ప్రయాణం

‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో చేయాలని భావించారు. ఇందుకోసం ఆయన తారక్‌కు కథ కూడా వినిపించారు. అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.

కథలో మార్పులు, డేట్ల సమస్యలు వంటి కారణాలతో ఆ సినిమా నిలిచిపోయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అనంతరం అదే సమయంలో రామ్ చరణ్‌కు కథ వినిపించగా ఆయనకు నచ్చడంతో ‘పెద్ది’ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అయితే తారక్‌కు చెప్పిన కథ ‘పెద్ది’ కథ కాదని బుచ్చిబాబు ఇటీవల స్పష్టం చేశారు.

‘నాన్నకు ప్రేమతో’ సెట్స్‌లో జరిగిన ఆసక్తికర సంఘటన

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో తనకు ఎదురైన ఓ ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారు. దర్శకుడిగా మారకముందు ఆయన సుకుమార్‌ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన నాన్న‌కు ప్రేమ‌తో సినిమా షూటింగ్ లండన్‌లో జరుగుతోంది.

ఆ షూటింగ్ సమయంలో అవకాశం చూసుకుని బుచ్చిబాబు తారక్‌కు ఒక కథ వినిపించారట. ఆ కథను పూర్తిగా విన్న తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన స్పందన మాత్రం బుచ్చిబాబును ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసిందట.

“నిజం చెప్పు.. ఈ కథ ఎక్కడో దొబ్బేశావ్ కదా?”

కథ విన్న అనంతరం ఎన్టీఆర్ సరదాగా, “నిజం చెప్పు.. ఈ కథ ఎవరి దగ్గరనో దొబ్బేశావ్ కదా?” అని అడిగారట. ఆ మాట విన్న వెంటనే తనకు ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అనిపించిందని బుచ్చిబాబు తెలిపారు.

అయితే వెంటనే అది విమర్శ కాదని, తన కథపై వచ్చిన గొప్ప ప్రశంస అని అర్థమైందన్నారు. సాధారణంగా “కథ బాగుంది”, “స్క్రీన్‌ప్లే బాగుంది”, “డైలాగులు బాగున్నాయి” అని చెప్పడం ఒక రకమైన కాంప్లిమెంట్ అయితే.. “ఇంత మంచి కథ నువ్వే రాశావా? లేక ఎక్కడైనా తీసుకొచ్చావా?” అనే స్థాయిలో స్పందించడం మరింత పెద్ద ప్రశంసగా భావించానని చెప్పారు.

ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై బుచ్చిబాబు ప్రశంసలు

ఈ సందర్భంగా తారక్ వ్యక్తిత్వం గురించి కూడా బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి ఉన్నప్పుడు తాను అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన స్టార్ హీరో అనే తేడా అసలు కనిపించదని అన్నారు. అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, స్నేహితుడిలా మెలుగుతారని తెలిపారు.

తారక్ తనకు ఎంతో ఇష్టమైన నటుడని, ఆయన నుంచి వచ్చిన ఆ వ్యాఖ్యను జీవితాంతం గుర్తుంచుకుంటానని బుచ్చిబాబు వెల్లడించారు.