TG Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. నిన్నటితో జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. ఇక మిగిలింది ఫలితాల విడుదలనే. అయితే ఏప్రిల్ 9న లేదా ఏప్రిల్ 12 లోపు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా 20 కేంద్రాల్లో 56 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. వాస్తవానికి మూల్యాంకనం మార్చి 25వ తేదీకే ముగియాలి కానీ తదితర కారణాల వల్ల ఆ గడువు మార్చి 31 వరకు కొనసాగింది. ప్రస్తుతం మూల్యాంకనం పూర్తి కావడంతో విద్యార్థుల మార్కులను సీజీజీకి అప్పగించారు. వారం రోజుల్లో మార్కులను సాంకేతికంగా అప్‌లోడ్ చేసి.. ఆ తర్వాత విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 9లోపు పూర్తి చేసి అదే రోజు లేదా ఏప్రిల్ 12 లోపు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు అధికారుల ద్వారా తెలిసింది.
ఇంటర్ పరీక్షలకు 9,97,075 మంది హాజరు కాగా, ఇందులో 4,89,126 మంది ఫస్టియర్, 5,07,949 మంది సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు 1495 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు.
