తెలంగాణ రాష్ట్రం నూతన సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామితులయ్యారు. కొత్త సీఎస్ గా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన సంజయ్ జాజు , మూడు రోజుల క్రితమే కేంద్రం సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సంజయ్ జాజును రిలీవ్ చేస్తున్నట్టు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (DoPT)ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఉద్యోగకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది.
1992 బ్యాచ్ తెలంగాణ క్యాడర్‌కు చెందిన సంజయ్ జాజు 12 ఏండ్లుగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. 2014 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ఆయన కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 20218-2023 వరకు భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. సంజయ్ జాజు ప్రస్తుతం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
సంజయ్ జాజు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఐటీ ముఖ్యకార్యదర్శిగా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా, విశాఖపట్టణం కమిషనర్‌గా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, సహాయ పునరావాస శాఖ కమిషనర్‌గా, నీటిపారుదల ఆయకట్టు ప్రాంత అభివృద్ధి శాఖ కమిషనర్‌గా, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీగా పనిచేశారు.
కొత్త సీఎస్ సంజయ్ జాజును పరిశ్రమలు వాణిజ్య శాఖ స్పెషల్ సీఎస్ గా కొనసాగించడంతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగం అదనపు బాధ్యతలను, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓగా, , స్పీడ్ విభాగం అదనపు బాధ్యతలను అప్పగించడం విశేషం.
రామకృష్ణారావుకు సీఎం సలహాదారు బాధ్యతలు
సీఎం సలహాదారుడిగా ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉతర్వులు జారీ చేసింది. ఆయన ఎక్స్ అఫిషియో స్పెషల్ సీఎస్ గా కొనసాగనున్నారు.
13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ..
తెలంగాణ సర్కార్ కొత్త సీఎస్ గా సంజయ్ జాజును నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం..ఆ వెంటనే మరో 13మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు చేసింది.
బదిలీలలో భాగంగా సీఎంవో నుంచి అజిత్ రెడ్డికి ఉద్వాసన పలికి.. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా నియమించారు. సీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ నియామితులయ్యారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ ను అదనంగా టెక్స్ టైల్స్ అదనపు కార్యదర్శిగా, శైలజా రామయ్యర్ ను అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా , అహ్మద్ నదీమ్ ను జీఏడీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జను, ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కే.గంగాధర్ ను నియమించారు. మహమ్మద్ అలీ ముష్రాఫ్ ఫరూఖీని టీజీఆర్ఈడీసీవో వీసీ,ఎండీగా నియమించారు.
పర్యాటకశాఖ డైరెక్టర్ గా విద్యాసాగర్ ను, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా టి. వెంకన్నను నియమించారు, హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ ,హ్యాండీక్రాఫ్ట్స్ ప్రత్యేక కార్యదర్శిగా పి.కాత్యాయానిదేవి, మైన్స్, జియాలజీ కార్యదర్శిగా ఎం.రఘునందన్ రావును నియామితులయ్యారు. తెలంగాణ పీసీసీఎఫ్ గా వినయ్ కుమార్ ను నియమించారు.
