అధికారులు, సిబ్బంది చేసే తప్పులు ఒక్కోసారి చూడ్డానికి ఫన్నీగా కనిపించినా..ఆ తప్పు వెనుక వారి నిర్లక్ష్య తీవ్రత ఎంత ఉందో అవగతమవుతుంటుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ప్రగతి స్టాల్స్ లో ఓ ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వింత ఫ్లెక్సీ కాస్తా..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సూర్యాపేట జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఓ స్టాల్ ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కింద డీఈవో అని రాసి ఉంది. మరోవైపు ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో కింద కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ సూర్యాపేట అని రాసి ఉండటం అందరిని విస్మయానికి గురి చేసింది. ఏకంగా సీఎం , మంత్రుల వివరాలనే తప్పుగా చిత్రీకరించి రూపొందించడం ఓ భారీ తప్పిదం అయితే..ఆ తప్పు కూడా విద్యాశాఖ చేయడం మరిన్ని విమర్శలకు తావిస్తుంది. విద్యాశాఖ చేసిన ఈ నిర్వాకానికి సంబంధించిన ఫ్లెక్సీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
