Singareni | పునరుద్పాదక ఇంధన రంగంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీతో సింగరేణి ఒప్పందం
సింగరేణి సంస్థ పునరుద్పాదక ఇంధన రంగంలో విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టబోతున్న నేపథ్యంలో ప్రముఖ జాతీయ స్థాయి విద్యుత్ ఉత్పాదక సంస్థ ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్‌జీఈఎల్ (ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్) తో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
విధాత, హైదరాబాద్ :
సింగరేణి సంస్థ పునరుద్పాదక ఇంధన రంగంలో విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టబోతున్న నేపథ్యంలో ప్రముఖ జాతీయ స్థాయి విద్యుత్ ఉత్పాదక సంస్థ ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్‌జీఈఎల్ (ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్) తో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం హైదరాబాద్ లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్‌తో పాటు సంస్థ డైరెక్టర్లు, ఎన్‌జీఈఎల్ తరఫున ఉన్నతాధికారులు ఆర్.మౌర్య, బిమల్ గోపాల చారి పాల్గొన్నారు. ఒప్పంద వివరాలను సింగరేణి సంస్థ ఛైర్మన్ వివరిస్తూ.. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా పలు పునరుద్పాదక ఇంధన రంగంలో ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించిందన్నారు. జాతీయ స్థాయిలో విద్యుత్పాదనలో దశాబ్దాల అనుభవం ఉన్న ఎన్టీపీసీ సహకారాన్ని తీసుకోదలచామని తెలిపారు.
ఎన్టీపీసీ సంస్థ గ్రీన్ ఎనర్జీ ఉత్పాదన కోసం ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. సింగరేణి సంస్థ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని వద్ద 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, అలాగే సోలార్ విద్యుత్తును 5 వేల మెగావాట్లకు పెంచాలని నిర్ణయించిందని వెల్లడించారు. మణుగూరు వద్ద జియో థర్మల్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తోందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కూడా నిర్మించాలన్న లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో అపార అనుభవం గల ఎన్టీపీసీ తోనూ అనుబంధ సంస్థ అయిన ఎన్‌జీఈఎల్ కంపెనీతోనూ ఒప్పందం కుదుర్చుకోవడం ఒక శుభ పరిణామం అని సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు.
గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ల ఏర్పాటులో సాంకేతిక సహాయం లేదా ఉమ్మడి భాగస్వామ్యం అంశం కూడా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో సింగరేణి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును విక్రయంలోనూ ఎన్టీపీసీ సహకారం తీసుకోనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ అనుబంధ సంస్థ ఎన్ జీ ఈ ఎల్ ఉన్నతాధికారి బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ బిమల్ గోపాలాచారి, హెడ్ (సివిల్ ఇంజినీరింగ్) ఆర్.ఆర్.మౌర్యలు మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలోకి కూడా ప్రవేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. తాము కూడా గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నామని ఇరువురి పరస్పర సహకారం మరియు భాగస్వామ్యంతో దేశ విదేశాల్లో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒప్పందం అనంతరం ప్రాజెక్టుల వారీగా సమీక్ష నిర్వహిస్తామని ఇరు పక్షాలకు లాభదాయకమైన ప్రాజెక్టులను ఎంపిక చేసి నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. 13 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణితో కలిసి నడవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ ఈ అండ్ ఎం ఎం.తిరుమలరావు, ఈడీ (ఎస్టీపీపీ) చిరంజీవులు, జీఎం (కోఆర్డినేషన్, మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్, జీఎం విశ్వనాథ రాజు తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram