Telangana Colleges Bandh | రూ.5 వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్..!

రూ.5 వేల కోట్లు విడుదల చేసే వరకు కాలేజీల బంద్‌ కొనసాగిస్తామని ఫాతి సంస్థ స్పష్టం చేసింది. విద్యా రంగంలో ఉద్రిక్తత చెలరేగింది.

Telangana Colleges Bandh | రూ.5 వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్..!

విధాత, హైదరాబాద్ : రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల్లో రూ.5 వేల కోట్లు విడుదల చేసే వరకు కాలేజీల బంద్‌ కొనసాగిస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్(‘ఫతి’ )స్పష్టం చేసింది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేవరకు బంద్‌ కొనసాగిస్తామని తెలంగాణ ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య అధ్యక్షుడు రమేశ్‌బాబు ప్రకటించారు. తాము ఎప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లలేదు.. కొంతకాలంగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేస్తుందని ఎదురుచూశాం.. పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల బకాయిలలో 50 శాతం తక్షణమే విడుదల చేయాలన కోరారు. మిగతా రూ.5 వేల కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల విడుదలపై స్పష్టత వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.

శ్రీదేవసేనను బదిలీ చేయాలి

తమ సమస్యలను పరిష్కరించాల్సిన సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన తమతోనే యూజ్‌లెస్‌ కాలేజీలని అన్నారని రమేశ్‌ వెల్లడించారు. ఉన్నత విద్యాసంస్థలపై ఇలాంటి అభిప్రాయం ఉన్న అధికారిణి.. కళాశాల బాగోగులు ఎలా చూస్తారని మండిపడ్డారు. గతంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లు కళాశాలలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని, అందుకు భిన్నంగా ఆమె మాత్రం తమను బెదిరిస్తున్నారని, సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆమెను బదిలీ చేయాలని ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కొత్త విధానం రూపకల్పనకు ప్రభుత్వం తాజాగా నియమించిన కమిటీలో అవసరం లేని వ్యక్తులు ఇద్దరున్నారని, వారిని తొలగించాలని, వారి స్థానంలో బ్యాంకింగ్‌ రంగంలో నిష్ణాతులైన వారిని నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే కమిటీ రిపోర్టు సమర్పణ గడువును మూడు నెలల నుంచి నెలకు కుదించాలని కోరారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించనందున తాము సిబ్బందికి వేతనాలు ఇవ్వలేకపోతున్నామని, వారికి క్షమాపణ చెప్పేందుకే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అధ్యాపకులు, ఇతర సిబ్బందిని హైదరాబాద్‌కు తరలించి ఈనెల 8న మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్బీ స్టేడియంలో ‘సాంత్వన’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.

సీఎంకు విద్యాశాఖపై సరైన సలహాల కరవు

ఫాతి ప్రధాన కార్యదర్శి బొజ్జ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగానికి సంబంధించి సీఎంకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చే అధికారులే లేరన్నారు. ఇది ఉన్నత విద్యారంగానికి ఇబ్బందికర పరిణామమన్నారు. ఇప్పటికే ఐదు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలు బంద్‌ పాటిస్తున్నాయి. ఈనెల 8న ఎల్బీ స్టేడియంలో లక్ష మందితో తెలంగాణ అధ్యాపక సాంత్వన సభ నిర్వహించనున్నామని వెల్లడించారు. 11న 10లక్షల మంది విద్యార్థులతో సచివాలయానికి లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు.