Site icon vidhaatha

అమిత్ షాపై కేసులు ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం

కాంగ్రెస్‌, బీజేపీ మధ్య బంధానికి నిదర్శనమన్న బీఆరెస్‌

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కోడ్ ఉల్లంఘించారంటూ తెలంగాణ పాతబస్తీ పోలీసులు నమోదు చేసిన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాగా అమిత్ షాపై కేసు ఉపసంహరణను బీఆరెస్ పార్టీ ట్విటర్ వేదికగా నిలదీసింది. కాంగ్రెస్- బీజేపీ మధ్య మళ్లీ బయటపడ్డ అక్రమ సంబంధం అంటూ విమర్శించింది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో భేటీ అనంతరం పాతబస్తీలో నమోదైన కేసు ఉపసంహరణ జరిగిందని పేర్కొంది.

గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడ్ ఉల్లంఘించాడన్న ఆరోపణతో షా పై కేసు నమోదు అయిందని తెలిపింది. సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ తమ చీకటి పొత్తును కొనసాగిస్తూనే ఉందని విమర్శించింది. మొన్న సింగరేణి బొగ్గు గనులు వేలంకు బీజేపీకి మద్దతునివ్వగా, రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అరాచక పాలనను ప్రశ్నించకుండా బీజేపీ మౌనం వహిస్తోందని, ఇప్పుడు కేసు కొట్టివేత జరిగిందని బీఆరెస్‌ వెల్లడించింది. ఇలా కాంగ్రెస్, బీజేపీ ఒకరికొకరు సహకరించుకుంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో మళ్ళీ బయటపడ్డ కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం అంటూ బీఆరెస్ తన ట్వీట్‌లో మండిపడింది

Exit mobile version