Registrations Stamp Duty | మహిళల పేరిట రిజిస్ట్రేషన్లకు స్టాంప్ డ్యూటీ తగ్గింపు.. పాత అపార్ట్‌మెంట్లకు గుడ్ న్యూస్!

Registrations Stamp Duty | మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సచివాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రితో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త స్టాంప్ విధానం రూపకల్పనకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. పాత చట్టంలో కొత్త, పాత అపార్ట్‌మెంట్‌లకు స్టాంప్ డ్యూటీ ఒకే విధంగా ఉందన్నారు. దీనిని సవరించి పాత అపార్ట్‌మెంట్‌లకు రిజిస్ట్రేషన్ తేదీలను పరిగణనలోకి తీసుకొని స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ చట్టం ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజానీకంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండా శాస్త్రీయ పద్దతిలో భూముల ధరల సవరణ జరగాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఏయే ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది? అక్కడ హేతబద్దంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది? తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని తెలిపారు.
రేవంత్ నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సాధారణ ప్రజలకు నష్టం కలిగించకుండా వ్యాపార ఒప్పందాలపై పారదర్శకత ఉండేలా భారతీయ స్టాంపు చట్టం 1899ను అనుసరించి తెలంగాణ సవరణ బిల్లు-2025ను తీసుకురావాలని నిర్ణయించామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. భారతీయ స్టాంపు చట్టం 1899 ప్రకారం, తెలంగాణ పరిధిలో నాలుగు సెక్షన్లు, 26 ఆర్టికల్స్ ను సవరించేందుకు 2021 లో శాసనసభలో సవరణ బిల్లును ఆమోదించి కేంద్రం ఆమోదం కోసం పంపామని, దీనిపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. వాటికి సమాధానం ఇచ్చినప్పటికీ 2023 జనవరిలో ఈ సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు చెప్పిన దానిపై మంత్రి మాట్లాడుతూ నాటి సవరణ బిల్లును ఉపసంహరించుకొని ప్రస్తుత కాలానికి అనుగుణంగా 2025 సవరణ బిల్లును తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని, నిబంధనలు కట్టుదిట్టమైన రూపంలోకి తీసుకురావడం కొత్త ఒప్పందాలకు చట్టబద్దత కల్పించడం లక్ష్యంగా బిల్లును రూపొందించాలని అలాగే పాత చట్టంలో లేనివాటిని కొత్త చట్టం పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని సూచించారు.