• Telugu News
  • /Telangana

Telangana New Liquor Shops Notification | తెలంగాణలో నూతన మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో 2025-27 కొత్త మద్యం దుకాణాల నోటిఫికేషన్ విడుదల. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు రిజర్వేషన్, లైసెన్స్ ఫీజు రూ.50 లక్షల నుంచి రూ.1కోటీ వరకు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Sep 25, 2025, 1:50 pm IST
Read Time: 4 mins
Telangana New Liquor Shops Notification | తెలంగాణలో నూతన మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నూతన మద్యం దుకాణాల(ఏ-4 వైన్స్ లు)కు రెండేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్స్ ల జారీకి(2025- 27) సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీలు, గీత కార్మికులకు కేటాయించే దుకాణాలను జిల్లా కలెక్టర్లు ఈ నెల 25న డ్రా పద్దతిలో ఎంపిక చేస్తారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలల్లో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఉండనున్నాయి. ఈనెల 26నుంచి ఆక్టోబర్ 18వరకు కొత్త దుకాణాల లైసెన్స్ ల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆక్టోబర్ 23వ తేదీన కొత్త దుకాణాల కేటాయింపుకు సంబంధించి డ్రా ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ డ్రాలో దుకాణాల లైసెన్స్ పొందిన వారు ఫస్ట్ ఇన్ స్టాల్మెంట్ మొత్తాన్ని అక్టోబర్ 23 నుంచి 24 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఆరు విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు. నవంబర్ 1 నుంచి నూతన దుకాణాల లైసెన్స్ అమలులోకి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది.

ఆరు స్లాబ్ లలో లైసెన్స్ ఫీజులు

ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. గతంలో ఉన్న రూ.2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫారం ధరను రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఈ మొత్తం సొమ్ము నాన్‌ రిఫండబుల్‌గా ప్రభుత్వం పేర్కొన్నది. కొత్త లైసెన్స్‌ కాల పరిమితి 2025 డిసెంబర్‌ 1 నుంచి 2027 నవంబర్‌ 30 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

కొత్త మద్యం దుకాణాలకు ఆరు స్లాబుల కింద లైసెన్స్‌ ఫీజు నిర్ణయంచింది. 5వేల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్‌ ఫీజు రూ.50 లక్షలుగా నిర్ణయించారు. 5 వేలు నుంచి 50 వేలు జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్‌ ఫీజు రూ.55లక్షలు, 50 వేలు నుంచి 1లక్ష జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్‌ ఫీజు రూ.60 లక్షలుగా నిర్ణయించారు. 1లక్ష నుంచి 5లక్షల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్‌ ఫీజు రూ.65 లక్షలుగా, 5లక్షల నుంచి 20 లక్షల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్‌ ఫీజు రూ.85 లక్షలుగా నిర్ణయించారు. 20 లక్షలు కంటే ఎక్కువ జనాభా ఉన్న మద్యం దుకాణం లైసెన్స్‌ ఫీజు రూ.1కోటి10 లైసెన్స్‌ ఫీజు నిర్ణయించారు.