BC Reservations | కాసేపట్లో బీసీ రిజర్వేషన్లపై జీవో!
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు 69% రిజర్వేషన్లతో బీసీ 42%, ఎస్సీ-ఎస్టీ 27% రిజర్వేషన్ల జీవో త్వరలో విడుదల అవుతుంది, ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది.

హైదరాబాద్, సెప్టెంబర్ 26(విధాత): కాసేపట్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం జీవో విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం, ఎస్సీ,ఎస్టీలకు 27 శాతం, పూర్తిగా 69 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు పోతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి రిజర్వేషన్లకు సంబంధించిన డేటాను సీల్డ్ కవర్ల రూపంలో ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి కావడంతో జీవోను విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రిజర్వేషన్లపై జీవో విడుదల చేసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ షెడ్యూల్‌ను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఖరారు అయిన అభ్యర్తులను బట్టి వారికి కేటాయించిన గుర్తుల ప్రకారం బ్యాలెట్ పత్రాలు ముద్రించనున్నారు. మొత్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో లోకల్ ఎలక్షణ్ జోష్ రాజుకుంది. అయితే ప్రభుత్వం ముందుగా సర్పంచ్ ఎన్నికల పెడుతున్నదా.. ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలు నిర్వహిస్తున్నదా అన్న అంశంపై సందిగ్ధత నెలకొన్నది.