బీసీ రిజర్వేషన్ల జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు స్టే విధించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రెండు వారాల్లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కూడా స్టే అమలుకానుంది.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 9 జీవోను సవాల్ చేస్తూ బి. మాధవరెడ్డి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గురువారం నాడు రెండో రోజున తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. బుధవారం నాడు అడ్వకేట్ జనరల్ వినతి మేరకు విచారణను గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి కుల గణన జరిగింది తెలంగాణలోనే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇంటింటికి వెళ్లి సర్వే చేశారని, సర్వేపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6 శాతం ఉందని చెప్పడాన్ని ఎవరూ కాదనడం లేదని ఆయన హైకోర్టుకు చెప్పారు. బీసీ జనాభా 57.6 శాతం ఉన్నందునే 42 వాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉన్నందునే
అసెంబ్లీ ఈ తీర్మానం చేసిందని ఆయన అన్నారు. మార్చి నుంచి గవర్నర్ వద్దే బిల్లు పెండింగ్ లో ఉందని, గడువులోపుగా గవర్నర్ ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి వస్తోందని ఏజీ వాదించారు. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ సమయంలో ఈ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందా లేదా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే బిల్లును హైకోర్టు ఆమోదించిందని అడ్వకేట్ జనరల్ చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వేరని ఆయన ప్రస్తావిస్తూ ఇందిరా సహాని కేసు విద్య, ఉద్యోగాలకు సంబంధించిందన్నారు. సహాని కేసు స్థానిక సంస్థలకు వర్తించదని ఏజీ వాదించారు. బీసీ బిల్లుపై ఏ పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదని ఆయన వివరించారు.

కులగణన సర్వేలో అన్ని కులాల వివరాలు తేలాయని ఏజీ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడిందని… నోటిఫికేషన్ ను చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి ఏజీ అందించారు. కొందరు ఇది నోటిఫికేషన్ కాదని ప్రచారం చేస్తున్నారని అది తప్పన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత న్యాయస్థానాల జోక్యం ఉండదని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ మేకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను ఆయన ప్రస్తావించారు. ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని కోరారు. అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించిన తర్వాత ప్రభుత్వం తర్వాత రవివర్మ అనే న్యాయవాది వాదనలు వినిపించారు. రిజర్వేషన్లకు రాజ్యాంగం ఎలాంటి పరిమితి విధించలేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం ఉన్న జనాభాకు బీసీలకు ఇచ్చిన 42 శాతంతో కలిపితే 67 శాతం మాత్రమే అవుతోందని వాదించారు. 15 శాతం జనాభాకు 33 శాతం ఓపెన్ గా ఉందని ఆయన తెలిపారు.