తెలంగాణలో పవర్ కట్ అనేదే లేదు: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేనేలేవని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో పవర్‌ కట్‌లను కోతలుగా భావించవద్దని ప్రజలను కోరారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలంలో సైతం ఒకేసారి సుమారు ఏడువేల మెగావాట్ల అదనపు భారాన్ని రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ‘ఎల్ నినో’ ప్రతికూల ప్రభావంతో వర్షాకాలంలోనూ వేసవిని తలపించే స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరగడం, మరోవైపు జలాశయాల్లో నీటి లభ్యత తగ్గిపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని చెప్పారు. అయినా ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించామన్నారు. బుధవారం హనుమకొండలో టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో రూ.56 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా వర్షాకాలంలో 11 వేల మెగావాట్లుగా ఉండే విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా 16,500 మెగావాట్లకు పెరగడం, మరోవైపు జలవిద్యుత్ ఉత్పత్తి 2,000 మెగావాట్లు తగ్గిపోవడం విద్యుత్ పంపిణీ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి సృష్టించినప్పటికీ ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలు, వర్షాభావం కారణంగా రైతులు అధికంగా బోరుబావులను వినియోగించడం వల్ల పెరిగిన విద్యుత్ అవసరాలను కూడా ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందన్నారు. రాష్ట్రంలో ‘పవర్ కట్’ అనే పరిస్థితి లేదని, ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ స్తంభాలు, లైన్లు దెబ్బతిన్నప్పుడు మాత్రమే తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని, దానిని పవర్ కట్‌గా భావించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

53 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తు

గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్న 53 లక్షల కుటుంబాల విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఏటా రూ.14 వేల కోట్ల సబ్సిడీని కూడా ప్రభుత్వం విడుదల చేస్తోందని మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ పనితీరును వివరించారు. 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు 70 కొత్త 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు, 31,448 కిలోమీటర్ల కొత్త విద్యుత్ లైన్లు, 35,736 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే కాలంలో 7.72 లక్షల కొత్త ఎల్టీ కనెక్షన్లు, 771 హెచ్‌టీ కనెక్షన్లు విడుదల చేయగా, 1,656 గ్రామాలు, 11.16 లక్షలకు పైగా వినియోగదారులు ప్రత్యక్షంగా లబ్ధి పొందినట్లు వెల్లడించారు.

రికార్డుస్థాయి విద్యుత్ డిమాండ్‌

2026 మార్చి 27న తెలంగాణలో నమోదైన 18,548 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్, 341.08 మిలియన్ యూనిట్ల రోజువారీ విద్యుత్ వినియోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అదే రోజు టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలో 6,574 మెగావాట్ల పీక్ డిమాండ్, 104.36 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా నిర్వహించినట్లు వెల్లడించారు. గృహజ్యోతి పథకం ద్వారా 26.59 లక్షల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరగా, 6.73 కోట్లకు పైగా జీరో బిల్లులు జారీ చేసినట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి రూ.17,524.09 కోట్ల సబ్సిడీ, 15,833 ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. రుణాల పునర్వ్యవస్థీకరణ ద్వారా సంవత్సరానికి రూ.134.30 కోట్ల వడ్డీ భారం తగ్గించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ టి. వెంకన్న, వరంగల్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) నిఖిల, టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Latest News