విధాత, హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి(TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా నాలుగు నోటిఫికేషన్ల విడుదల చేయగా..వాటి ద్వారా 7,437 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. సివిల్ పోలీస్, ఏఆర్, స్పెషల్ పోలీస్, ఫైర్, ఎమర్జన్సీ, జైళ్ల శాఖలకు సంబంధించి 4 నోటిఫికేషషన్లు జారీ చేసింది.
పోలీస్ శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్ (సివిల్) 148, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (AR) 14, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (TGSP) 12, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (SARCPL) 3, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (FPB) 23 పోస్టులు ఉన్నాయి.
అలాగే పోలీస్ కానిస్టేబుల్ విభాగానికి వస్తే సివిల్ కానిస్టేబుల్ 3,697, AR 1,052, SARCPL 24, డ్రైవర్ PTO 20, మెకానిక్ PTO 7 ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) పరిధిలో 44 సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు, 1,380 కానిస్టేబుల్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగానికి సంబంధించి 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 751 ఫైర్ ఫైటర్ ఖాళీలు ఉన్నాయి. అలాగే జైళ్ల శాఖలో 14 డిప్యూటీ జైలర్ (పురుషులు), 1 డిప్యూటీ జైలర్ (మహిళలు), 196 వార్డర్ (పురుషులు), 12 వార్డర్ (మహిళలు) ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
అర్హత ఉన్న అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందే నోటిఫికేషన్‌లో పేర్కొన్న దేహదారుఢ్య, వైద్య ప్రమాణాలకు తాము తగినట్లుగా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి సివిల్ సర్జన్‌తో పరీక్షించుకోవాలని అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్ సూచించారు.
ఆన్‌లైన్ అప్లికేషన్ దాఖలు చేయడానికి తెలంగాణ స్థానికతకు సంబంధించిన బోనాఫైడ్ (1 నుంచి 7వ తరగతి) లేదా నివాస ధృవీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలి. అలాగే ఏప్రిల్ 1, 2026 తర్వాత జారీ చేసిన బీసీ కేటగిరీ అభ్యర్థుల నాన్-క్రీమీలేయర్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికేట్, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు తమ ఉపకుల వర్గీకరణ స్పష్టంగా ఉండేలా కుల ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్ తెలిపారు.దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
ఎంపికైన వివిధ విభాగాల్లోని ఎస్‌ఐ పోస్టులకు రూ.42,300 నుంచి రూ.1,15,270 వరకు పే-స్కేల్ వర్తిస్తుండగా, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు రూ.38,890 నుంచి రూ.1,12,510 వరకు జీతభత్యాలు ఉండనున్నాయి.
