Indian Roller : ‘పాలపిట్ట’..అంతరించిపోతున్న పక్షి జాతుల జాబితాలోకి!

తెలంగాణ రాష్ట్ర పక్షి 'పాలపిట్ట' (ఇండియన్‌ రోలర్) అంతరించిపోతున్న పక్షి జాతుల జాబితాలోకి చేరింది. క్రిమి సంహారకాలు, పట్టణాభివృద్ధి, కాలుష్యం కారణంగా గత 12 ఏళ్లలో దీని సంతతి 30% తగ్గిందని IUCN వెల్లడించింది. పాలపిట్ట మనుగడ 'అపాయస్థితికి సమీపం' (Near Threatened) వర్గంలో ఉంది.

Indian Roller

విధాత : విజయ దశమి రోజున పాలపిట్ట దర్శనం..విజయ సంకేతంగా తెలంగాణ ప్రజల నమ్మకం. తెలంగాణ ధార్మిక సంస్కృతితో ముడిపడిన పాలపిట్ట జాతి మనుగడ ప్రమాదంలో పడింది. క్రమంగా అంతరించిపోతున్న పక్షి జాతుల్లో తెలంగాణ రాష్ట్ర పక్షి ‘పాలపిట్ట’ కూడా ఉండటం ఆందోళన కల్గిస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ( IUCN) వీటిని అంతరించిపోయే జాబితాలో చేర్చింది. గత 12 ఏళ్లలో పాలపిట్ట సంతతి 30 శాతం తగ్గిందని ఐయూసీఎన్ వెల్లడించింది. క్రిమి సంహారకం, రసాయనాల వాడకం, పట్టణాభివృద్ధి, గ్లోబల్‌ వార్మింగ్, కాలుష్యం, మొబైల్‌ టవర్ల ద్వారా వస్తున్న రేడియేషన్‌ వంటివి పక్షు జాతులు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలుగా పేర్కొంది.

కాపడలేకపోతన్న చట్టాలు

పాలపిట్టను ఇండియన్‌ రోలర్, బ్లూ జే అని కూడా పిలుస్తారు. రెక్కలు విచ్చుకున్నప్పుడు ముదురు, లేత నీలం రంగులతో, తెలుపు, గోధుమ, నలుపు రంగులతో ఈ పక్షి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పాలపిట్ట అటవీచట్టం పరిధిలోకి వస్తుంది. షెడ్యూల్‌-4లో ఉండటం వల్ల వాటిని బంధించినా హింసించినా నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదవుతాయి. అలాగే, మూడేళ్ల జైలు లేదా రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఐనప్పటికి తెలంగాణలో ఇటీవల దసరా సందర్భంగా పాలపిట్టలను బంధించి దర్శనం పేరుతో కొందరు సొమ్ము చేసుకుంటూ వాటి మనుగడకు ముప్పుగా మారారు. ఈ పక్షులకు ప్రధానంగా గడ్డి మైదానాలు, మెట్ట ప్రాంతాలు, వ్యవసాయ పొలాలు, బీడు భూములు, చిట్టడవులు వంటి ప్రాంతాలే ఆవాసాలు. కానీ ఈ సహజావాసాలు.. పట్టణీకరణ, వ్యవసాయ విస్తరణ, ఆక్రమణ జాతుల వ్యాప్తి, అవసరంలేని అటవీకరణ వంటి కారణాలు పాలపిట్టల జాతిని దెబ్బతీస్తున్నాయి.

రైతు నేస్తాలు పాలపిట్టలు..

పాలపిట్టలను రైతు నేస్తాలుగా భావిస్తుంటారు. పంట పొలాలు, తోటలు, ఉద్యాన వనాల్లో తెగుళ్లను ఆహారంగా తీసుకుంటు..పంటలను నష్టపరిచే కీటకాలు, సరీసృపాలను, చిన్న కప్పలు, మిడతలు, కీచురాళ్లు వంటి వాటిని వేటాడి తింటుంటాయి. ఎక్కువగా భారత్, ఇరాక్, థాయ్‌లాండ్‌లో కనిపించే పాలపిట్టల జీవితకాలం 17–20 ఏళ్లుగా బర్ఢ్స్ ఎక్స్ పర్ట్స్ చెబుతుంటారు. చెట్ల తొర్రల్లో గూళ్లు పెట్టి మూడు నుంచి ఐదు గుడ్ల వరకు పెడతాయి. వీటి ప్రత్యుత్పత్తి కాలం వాటి ఆవాస ప్రాంతాలను బట్టి ఫిబ్రవరి–జూన్‌ నెలల మధ్యలో ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో పాలపిట్ట సహా నాలుగు పక్షి జాతులను మనుగడ ప్రమాదంలో ఉన్న జాతులుగా ఐయూసీఎన్ గుర్తించింది. ఇండియన్ కోర్సర్, ఇండియన్ రోలర్ (పాలపిట్ట), రూఫస్-టైల్డ్ లార్క్, లాంగ్-బిల్డ్ గ్రాస్‌హాపర్ వార్నర్లు (గొల్లభామ) సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తెలిపింది. వీటిలో గొల్లభామను ‘తీవ్ర ప్రమాదస్థితి’ జాబితాలో చేర్చింది. మిగతా మూడింటిని ‘నియర్ త్రెటెండ్’ (అపాయస్థితికి సమీపం) వర్గంలోకి చేర్చింది. ఈ నాలుగు జాతులు నిరంతరంగా తగ్గిపోతుండటమే వాటిని మనుగడ ప్రమాదంలో పడిన జాబితాలో చేర్చడానికి కారణమని ఐయూసీఎన్ పేర్కొంది.