హైదరాబాద్ : బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. ఆదివారం గోల్కొండలో బోనాల పండుగకు సర్వం సిద్ధమైంది. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ఈ బోనాల వేడుకకు హైదరాబాద్ నగరం నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అమ్మవారి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు.
ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి గోల్కొండ కోటకు 75 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, సీబీఎస్, పటాన్‌చెరు, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్, మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, రాంనగర్, చార్మినార్, ఉప్పల్, కేపీహెచ్‌బీ కాలనీ, ఓల్డ్ బోయిన్‌పల్లి, మల్కాజ్‌గిరి నుంచి గోల్కొండ కోట వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. బోనాల పండుగకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరింది.
ఎక్కడ్నుంచి ఎన్ని బస్సులు అంటే..?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ – 10
కాచిగూడ రైల్వే స్టేషన్ – 5
సీబీఎస్ – 5
పటాన్‌చెరు – 5
ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్ – 4
మెహిదీపట్నం – 8
దిల్‌సుఖ్‌నగర్ – 4
హయత్‌నగర్ – 2
కూకట్‌పల్లి – 2
రాజేంద్రనగర్ – 4
రాంనగర్ – 4
చార్మినార్ – 6
ఉప్పల్ – 4
కేపీహెచ్‌బీ కాలనీ – 4
ఓల్డ్ బోయిన్‌పల్లి – 4
మల్కాజ్‌గిరి – 4