Medak | రామాయంపేట గురుకుల హాస్టల్‌లో ఎలుకల దాడి.. 12మంది విద్యార్థినిలకు గాయాలు

మెద‌క్ జిల్లాలోని రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల వ‌స‌తి గృహంలో ఎలుక‌ల దాడిలో 12 మంది విద్యార్థినిలకు గాయాలయ్యాయి.

Medak | రామాయంపేట గురుకుల హాస్టల్‌లో ఎలుకల దాడి.. 12మంది విద్యార్థినిలకు గాయాలు

విధాత, హైదరాబాద్ : మెద‌క్ జిల్లాలోని రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల వ‌స‌తి గృహంలో ఎలుక‌ల దాడిలో 12 మంది విద్యార్థినిలకు గాయాలయ్యాయి. ఎలుకలు విద్యార్థినిలను కొరకడంతో వారు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. బాధిత విద్యార్థినుల‌కు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చికిత్స కొన‌సాగుతోంది. సమాచారం తెలుసుకున్న త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌తో తమ పిల్లల వద్దకు చేరుకుంటున్నారు. హాస్టల్‌లో ఎలుక‌లు సంచ‌రిస్తూ, నిద్రిస్తున్న స‌మ‌యంలో త‌మ‌ను కొరుకుతున్నాయ‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్రిన్సిపాల్‌కు విద్యార్థినులు చెప్పిన‌ప్ప‌టికీ ప‌ట్టించుకోవ‌డం లేదంటూ తల్లిదండ్రులు ఆరోపించారు.

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లో ప్ర‌తి రోజు ఏదో ఒక స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కలుషిత అహారం, అల్పాహారంలో బ‌ల్లులు, చట్నీల్లో ఎలుక రావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి చనిపోగా, కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడడంతో 20 మంది విద్యార్థులు వాంతుల‌తో ఆస్ప‌త్రుల్లో చేరారు. సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ హాస్టల్‌లో చట్నీలో చిట్టెలుక కనిపించడంతో విద్యార్థులు బెంబేలెత్తారు. సంక్షేమ హాస్టల్స్‌లో చోటుచేసుకుంటున్న ఈ తరహా ఘటనలతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం హాస్టల్స్ నిర్వాహణపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.