కాలం మారింది అంటే ఏమిటో చూడాలంటే దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను ఎక్కాల్సిందే. గతంలో ఆర్టీసీ బస్సులలో స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం..వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అన్న బోర్డులు ఏర్పాటు చేయడం అందరికి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఆర్టీసీ ఉచిత బస్సు పథకం దెబ్బకు సీన్ రివర్సైంది. ఇప్పుడు బస్సులలో పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం..వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిద్దాం బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ బోర్డులను చూసిన ప్రయాణికులు..ముఖ్యంగా పురుషులు అశ్చర్యానికి గురవుతున్నారు.
నిజానికి మహాలక్ష్మి ఆర్టీసీ ఉచిత పథకం అమలులోకి వచ్చాక ఆర్టీసీ బస్సు ప్రయాణాలలో అనేక సిత్రాలు వెలుగుచూస్తున్నాయి. బస్సులలో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిపోవడంతో సిగపట్లు సైతం పెరిగిపోతున్నాయి.గా బస్సులో అధిక శాతం సీట్లలో మహిళలే కనిపిస్తున్నారు. తమకు కేటాయించిన సీట్లలో తమను కూర్చోనివ్వాలంటూ పురుషులు మహిళలను ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. గట్టిగా తమ కోటా సీట్ల కోసం అడిగిన పురుష ప్రయాణికులతో మహిళలు వాగ్వివాదాలకు దిగుతున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే పురుష ప్రయాణికులు జడుసుకునే పరిస్థితి నెలకొంది. అయితే సంస్థకు తక్షణ ఆదాయం రావాలంటే పురుష ప్రయాణికులే ఆర్టీసీకి పెద్ద దిక్కుగా మారారు.
ఈ వాస్తవాన్ని గుర్తించిన తెలంగాణ ఆర్టీసీ సంస్థ కాలానుగుణంగా వచ్చిన కఠిన వాస్తవాలను గుర్తించి..సంస్థ బస్సులకు పురుష ప్రయాణికులకు దూరం కాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా.. పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం..వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిద్దాం అంటూ బోర్డులు ఏర్పాటు చేస్తుంది. ఈ నిర్ణయంతోనైన తమ బస్సుల్లో పురుష ప్రయాణికులు ఆత్మగౌరవంతో ప్రయాణిస్తారని ఆర్టీసీ భావిస్తుంది.
