- చిన్నారులను ఆడించిన చాహత్ బాజ్‌పాయ్
- చిన్నారిని దత్తతగా దంపతులకు అందజేత
- శిశుగృహంలో వసతులు పరిశీలించిన కలెక్టర్
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Collector Chahat Bajpai | బోసినవ్వులొలికే చిన్నారిని చూస్తే ఎవరికి ముచ్చటేయదు? ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న సామెత ఉంది.. ఇక్కడ తాను కలెక్టరైనా.. ఒక తల్లినేనని చాటుకున్నారు వరంగల్ కలెక్టరమ్మ చాహత్ బాజ్‌పాయ్. శిశు గృహంలో ఉన్న చిన్నారులను చూడగానే ఆమెలోని అమ్మతనం అభివ్యక్తమైంది. అనిర్వచనీయమైన ఆ పాత్రను కాసేపు పోషించారు. అక్కడ ఉన్న చిన్నారులంతా అమ్మా, నాన్నల ఆప్యాయతకు నోచుకోకుండా, ఆయాల అనురాగంలో ఉన్నవారే కావడం గమనార్హం.
శిశుగృహంలోని ఊయల్లో ఉన్న చిన్నారులతో కలెక్టరమ్మ ఊసులాడి.. తన ఒడిలోకి తీసుకుని లాలించారు. దత్తత ఇచ్చే శిశువును ఎత్తుకొని ఆప్యాయంగా పలకరించి సంతోషం వ్యక్తం చేశారు. దత్తత తీసుకునే దంపతులకు తన చేతుల మీదుగా అందజేసి ఆనందం వ్యక్తం చేశారు. అక్కడ గడిపింది కాసేపే అయినప్పటికీ.. ఉన్నత ఉద్యోగ బాధ్యతలో భాగంగా ‘అమ్మ’ పాత్రను నిర్వహించిన ఆ దృశ్యం అందరినీ కట్టిపడేసింది. అంతేకాకుండా అధికారిగా అక్కడ ఉన్న వసతులు, చిన్నారుల ఆలనా,పాలనా, ఆహారం తదితర అంశాలపై ఆరా తీశారు.
మాతృత్వం ఒక వరం – చట్టబద్ధమైన దత్తతే శ్రేయస్కరం:
మాతృత్వం ఒక వరమని, దానికి చట్టబద్ధమైన దత్తత మార్గమే శ్రేయస్కరమని చాహత్ బాజ్ పాయ్ ఈ సందర్భంగా అన్నారు. బుధవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక దత్తత విభాగాన్ని సందర్శించిన కలెక్టర్, కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం ఎంపికైన శిశువును హనుమకొండ జిల్లా వడ్డేపల్లికి చెందిన దంపతులకు దత్తతగా అప్పగించారు. ఆ దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్నట్లు, సీనియారిటీ ఆధారంగా నాలుగు నెలల శిశువును దత్తతగా అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అక్రమ దత్తత చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడకూడదని సూచించారు. ప్రతి దత్తత కూడా కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ నిబంధనలకు అనుగుణంగా జరగాలని పేర్కొన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ మాట్లాడుతూ, ప్రత్యేక దత్తత విభాగం ద్వారా 2007 సంవత్సరం నుండి ఇప్పటివరకు దేశీయ దత్తత కింద 220 మంది పిల్లలను, విదేశీ దత్తత కింద అమెరికా, మాల్టా, ఇటలీ, దుబాయి వంటి దేశాలకు 12 మంది పిల్లలను దత్తతగా ఇవ్వడం జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికి సుధాకర్, ఇంచార్జి జిల్లా శిశు పరిరక్షణ అధికారి ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం. మౌనిక, శిశు గృహ ఇన్‌చార్జి మేనేజర్ అనుముల మాధవి, సోషల్ వర్కర్ సంగి చైతన్య, నర్స్ పుల్ల మౌనిక, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
