భాగ్యనగరంలో నీటికి కటకట.. 2 నెలల్లో 4 లక్షల వాటర్ ట్యాంకులు!

ఒకవైపు ఎండలు.. మరోవైపు జల విలయంతో భాగ్యనగరం విలవిలాడుతోంది. రోజురోజుకూ ఎండలు పెరిగిపోతుండటంతో దానికి తగ్గట్టుగానే నీటికి డిమాండ్ పెరుగుతోంది

భాగ్యనగరంలో నీటికి కటకట.. 2 నెలల్లో 4 లక్షల వాటర్ ట్యాంకులు!

విధాత, హైదరాబాద్: ఒకవైపు ఎండలు.. మరోవైపు జల విలయంతో భాగ్యనగరం విలవిలాడుతోంది. రోజురోజుకూ ఎండలు పెరిగిపోతుండటంతో దానికి తగ్గట్టుగానే నీటికి డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఒక్క ఏప్రిల్ నెలలోనే వాటర్ ట్యాంకర్లు 2.37 లక్షల ట్రిప్పులు పూర్తి చేయగా, అంతకు ముందు నెల మార్చిలో 1.69 లక్షల ట్రిప్పులు అందించింది. కేవలం రెండు నెలల్లోనే 4.06 లక్షల ట్రిప్పులు పూర్తి అయ్యాయంటే నీటి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్ ప్రారంభంలో 613 ట్యాంకర్లు ఉండగా, డిమాండ్ పెరగడంతో ఆ సంఖ్య 840కి పెరిగింది.

జలమండలి ప్రకారం.. నగరంలో దాదాపు సగం మంది ప్రజలు 48.96% మంది మొబైల్ యాప్ ద్వారా ట్యాంకర్లను బుక్ చేసుకున్నారు. సుమారు 36.78% మంది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా బుక్ చేసుకోగా, 14.16% మంది వాటర్ బోర్డు వెబ్ సైట్ ను ఎంచుకున్నారు. పెరుగుతున్న డిమాండ్ ద్రుష్ట్యా హెచ్ ఎండబ్ల్యుఎస్ అండ్ ఎస్ బి మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి ట్యాంకర్ నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మేలో అధిక బుకింగ్ లకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ఆశించిన డిమాండ్ ను తీర్చడానికి జూన్ నాటికి రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2లోని ప్యాకేజీ-1 కింద నిర్మిస్తున్న వివిధ రిజర్వాయర్లను పరిశీలించిన ఎండీ సుదర్శన్ నిర్మాణాన్ని వేగవంతం చేసి జూన్ నాటికి అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని సరఫరా చేయడానికి ఈ రిజర్వాయర్లు కీలకం. ఈ ప్యాకేజీ కింద ప్లాన్ చేసిన 33 రిజర్వాయర్లలో ఇప్పటికే 22 పూర్తయ్యాయని, మిగిలిన 11 రిజర్వాయర్ల నిర్మాణం 90 శాతం పూర్తయిందని తెలిపారు. గ్రేటర్ వ్యాప్తంగా నీటి పంపిణీని పెంచేందుకు 1522.27 కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు.