Site icon vidhaatha

IRCTC Tour | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్ నుంచి శబరిమల భారత్‌ గౌరవ్‌ రైలు..

IRCTC Tour | శబరిమల (Sabarimala) అయ్యప్ప (Ayyappa Swamy) భక్తులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) గుడ్‌న్యూస్‌ చెప్పింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు (Bharat Gaurav Tourist Train)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ దేఖో అప్నా దేశ్‌లో భాగంగా భారత్‌ గౌరవ్‌ రైలును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యాటక రైలుకు పర్యాకుల నుంచి స్పందన లభిస్తున్నది. ఇప్పటికే సికింద్రాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు భారత్‌ గౌరవ్‌ రైలు నడుస్తున్నది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు సైతం ప్రత్యేక టూరిస్ట్‌ రైలును నడుపబోతున్నది. నవంబర్‌ 16 నుంచి 20 వరకు పర్యాటక యాత్ర కొనసాగనున్నది. ఇటీవల యాత్ర బ్రోచర్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ ఆవిష్కరించారు.

ఈ పర్యటనలో అయ్యప్ప ఆలయంతో పాటు ఎర్నాకులం చోటానిక్కర భగవతి అమ్మవారి ఆలయం దర్శించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు యాత్ర కొనసాగనున్నది. ఏసీ, త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌లో పర్యాటకులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. టికెట్‌ ధరలు రూ.11,475 నుంచి మొదలుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ రైలు సికింద్రాబాద్‌, నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో రైలు ఆగనున్నది. నవంబర్‌ 16న ఉదయం 8 గంటలకు భారత్‌ గౌరవ్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరనున్నది. మరుసటిరోజు రాత్రి 7గంటలకు కేరళ చెంగనూరుకు చేరుతుంది. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా నీలక్కళ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి సొంత ఖర్చులతో కేరళ ఆర్టీసీ బస్సులో పంబ వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

మూడోరోజు అయ్యప్ప దర్శనం ఉంటుంది. అభిషేకం పూర్తయ్యాక మధ్యాహ్నం ఒంటిగంట వరకు నీలక్కళ్‌ నుంచి చోటానిక్కర భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత తిరిగి ఎర్నాకులం రైల్వేస్టేషన్‌కు చేరుకొని ఐదురోజు రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. ఇక ప్యాకేజీ ధర విషయానికి వస్తే.. ఎకానమీ కేటగిరిలో ఒక్కో టికెట్ ధర రూ.11,475 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 సంవత్సరాల మధ్య చిన్నారులకు విత్‌ బెడ్‌తో రూ.10,655 చెల్లించాలి. థర్డ్‌ ఏసీ కేటగిరిలో రూ.18,790, చిన్నారులకు రూ.17,700.. సెకండ్‌ ఏసీ కేటగిరికి రూ.24,215 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలోనే ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ అవుతాయి. వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరింది.

Exit mobile version