ఒక ఫ్లాట్‌లో 436 కొండచిలువలు.. తప్పించుకున్న కొండచిలువ చెప్పిన రహస్యం..

తీగలాగితే.. డొంక కదలడం అంటే ఇదేనేమో! కరెంటు బిల్లు పెద్ద మొత్తంలో వచ్చిందని మొదలు పెట్టిన ఎంక్వైరీ ఆఖరుకు ఒక ఫ్లాట్‌లో మూడు వందలకు పైగా కొండచిలువలను బయటపెట్టింది. చైనాలోని తూర్పు ప్రాంతమైన తైజౌలో చోటు చేసుకున్న ఈ ఉదంతం.. అసాధారణ పెంపుడు జంతువుల అక్రమ పెంపకాన్ని మరోసారి చర్చనీయాంశం చేసింది.

illegal python breeding image generated with ai help

ఈ కథ మొత్తం గత ఏడాది మార్చిలో ఒక భారీ కొండచిలువ కనిపించడంతో మొదలైంది. వాస్తవానికి అక్కడ అందులోనూ వసంతకాలం ప్రారంభంలో కొండచిలువలు కనిపించవు. ఒకవేళ కనిపించాయని అనుకున్నా.. అంతటి మందంతో, భారీ స్థాయిలో అసలే ఉండవు. దీనిపై స్థానిక గిరిజనులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ కొండచిలువ అనేక ప్రశ్నలు లేవనెత్తింది. వాస్తవానికి ఈ సమయంలో పాములు బ్రూమేషన్‌ దశలో ఉంటాయి. అంటే.. జీవక్రియలన్నింటినీ దాదాపు స్తంభింపచేసుకుని ఉండే ఒక నిద్రాణమైన పరిస్థితి. ఈ సమయంలో పాములు బయటకనిపించవు. ఇదే తొలి ప్రశ్నకు చాన్స్‌ ఇచ్చింది. ఆ ప్రశ్న.. ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా జూ లాంటి ప్రాంతం నుంచి తప్పించుకుని వచ్చిందేమోనని తొలుత అధికారులు అనుమానించారు. కానీ.. అది ఎక్కడి నుంచి వచ్చిందనేది గుర్తించడం దుర్లభంగా మారింది.

ఇక్కడే ట్విస్ట్‌

సరిగ్గా అదే సమయంలో విద్యుత్తు విభాగంలోని రికార్డుల్లో ఒక అసాధారణ అంశం కనిపించింది. అదే ఈ కేసును కొత్త మలుపు తిప్పింది. ఒక ఫ్లాట్‌కు పెద్ద మొత్తంలో కరెంటు బిల్లు వచ్చింది. దీనిపై ఎంక్వైరీ చేసేందుకు వెళ్లిన అధికారులు అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి నోరెళ్లబెట్టారు. ఎందుకంటే.. అక్కడ వందల కొద్దీ కొండచిలువలను అత్యంత జాగ్రత్తగా పెంచుతున్నారు. పాములకు చలికాలంలో అవసరమైన స్థాయిలో ఉష్ణోగ్రతను కల్పించేందుకు అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఆ ఏర్పాట్లకే పెద్ద ఎత్తున విద్యుత్తు వినియోగం అవుతున్నట్టు గమనించారు. అదొక కొండచిలువల అక్రమ పెంపక కేంద్రం. సాధారణ ఇంటి ముసుగులో చేస్తున్న అక్రమ వ్యాపారం. నిజానికి ఆ ఫ్లాట్‌ను నివాస అవసరాలకు ఉపయోగించడం మానేసి చాలా కాలం అయింది. అందులోని రెండు బెడ్‌రూమ్స్‌, లివింగ్‌ రూమ్‌ను కొండచిలువల పంజరాలుగా మార్చారు. గది నిండా ప్లాస్టిక్‌ డ్రమ్ములు ఉన్నాయి. అందులో వందల కొద్దీ కొండచిలువలు కదులుతున్నాయి. ఆ ఇంటిలోని ఇతర సామగ్రిని, ఫర్నీచర్‌ను ఒక మూలకు నెట్టేసి ఉన్నాయి. అదికాక మిగిలిన మొత్తం ప్రదేశాన్ని కొండచిలువల పెంపకానికి వాడుతున్నారు.

అక్రమ పెంపక కేంద్రం వెనుక భారీ రాకెట్‌

రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం తనిఖీలు చేస్తే.. తొలి దశలో 309 కొండచిలువలు లెక్క తేలాయి. అయితే.. అది విచారణలో మొదటి భాగం మాత్రమే. అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. విషయం లోతులకు వెళ్లి విచారణ చేస్తే.. నిర్ఘాంతపోయే వాస్తవాలు బయటపడ్డాయి. కొండచిలువల షిప్‌మెంట్‌ రసీదులు, ఆర్థిక లావాదేవీల పత్రాలు, ఆన్‌లైన్‌ యాక్టివిటీ.. అన్నీ బయటకు వచ్చాయి. రక్షిత సరీసృపాలను పెంచి.. అమ్ముతున్న భారీ రాకెట్‌లో ఈ ఫ్లా్‌ట్‌ ఒక భాగమని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందులో అనేక మంది భాగస్వామ్యం ఉందని తేల్చారు.

కొండచిలువలకు ఆహారంగా ఎలుకల సరఫరా

ఒక వ్యక్తి ఇక్కడ పెంచుతున్న కొండచిలువలకు ఆహారంగా ఎలుకలను సరఫరా చేసినట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మరొక వ్యక్తి ఈ ఫ్లాట్‌ నిర్వహిస్తున్న వ్యక్తులకు కొండచిలువలను సరఫరా చేసినట్టు భావిస్తున్నారు. సోషల్‌ మీడియా పోస్టులు, లావాదేవీల రికార్డులు అన్నీ పరిశీలించిన అధికారులు.. ఇదొక మాఫియా వ్యాపారంగా తేల్చారు. అక్కడ ఒక్కో ప్రదేశాన్ని పరిశీలించిన కొద్దీ కొండచిలువల సంఖ్య పెరుగుతూ పోయింది. మొత్తంగా అక్కడి నుంచి తప్పించుకున్న ఒక్క కొండచిలువ.. మొత్తంగా 436 కొండచిలువలను పట్టించింది. వీటి విలువ చైనా కరెన్సీలో 30 మిలియన్‌ యువాన్లు ఉంటుందని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. అంటే.. భారతీయ కరెన్సీలో సుమారు 40 కోట్లు. ఇక్కడ సంరక్షించిన కొండచిలువలను స్థానిక జూ కు తరలించారు.

చైనాలో పెరుగుతున్న పాముల పెంపకం

ఇటీవలి కాలంలో ఇటువంటి అసాధారణ జంతువుల పెంపకం పెరుగుతున్న క్రమంలో ఈ అక్రమ దందా చైనాలో సంచలనంగా మారింది. పాములు, సరీసృపాల వంటివాటిని పెంచుకుంటున్న వారి సంఖ్య చైనాలో కోటీ డెబ్బై లక్షల మంది వరకూ ఉంటుందని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొన్నది. అయితే చైనాలో కొండచిలువల పెంపకంపై కఠిన నియంత్రణలు ఉన్నాయి. వీటిని చైనా అధికారులు గ్రేడ్‌ 2 ప్రొటెక్టెడ్‌ వైల్డ్‌లైఫ్‌గా క్లాసిఫై చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వీటిని పెంచడం, రవాణా చేయడం, అమ్మడం చట్టవిరుద్ధం. మొత్తానికి కనిపించని సమయంలో కనిపించిన ఒక కొండ చిలువ పెద్ద అక్రమ దందానే బయటపెట్టింది.

Latest News