’19వ శతాబ్దం నుంచి ఇంగ్లండ్‌లో ‘ఫూల్స్ డే’ను జరుపుకుంటున్నారు. ఆ ‘ఫూల్స్ డే’ రోజు ఎక్కువగా పిల్లలనే ఆటపట్టిస్తుంటారని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్‌కు చెందిన చరిత్రకారులు ఆండ్రియా లివ్సీ తెలిపారు. కానీ ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో చాలామందికి తెలీదని ఆమె అన్నారు. ఈ ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ గురించి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెబుతున్నారని, ఆ కథలన్నీ సరదాగా ఉంటాయని ఆండ్రియా అన్నారు. ‘ఫూల్స్ డే’ గురించి వినిపిస్తున్న ముఖ్యమైన మూడు కథలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొదటి కథ – కవిత్వం
14వ శతాబ్దంలో ఆంగ్ల కవి జాఫ్రీ ఛాసర్ రాసిన ‘గుంటనక్క-కోడిపుంజు’ కవితతో ఫూల్స్ డే మొదలైందని కొందరి వాదన. ఈ కథలో గుంటనక్క కోడి పుంజును భయపెట్టి, ఆటపట్టిస్తుంది. అప్పటి నుంచి ఏప్రిల్ 1న అందరూ తమవారిని ఆటపట్టించడం ఒక సంప్రదాయంగా మారింది. అయితే తన కవితో ఛాసర్ ‘ఏప్రిల్ 1’ అని ఎక్కడా ప్రస్తావించలేదు. ‘మార్చి మొదలయ్యాక 32 రోజులకు’ అని రాశాడు. మార్చి మొదటి నుంచి 32 రోజులు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు వస్తుంది కాబట్టి దాన్నే ఫూల్స్ డే జరుపుకుంటున్నారని ఆండ్రియా చెప్పారు.
రెండో కథ – క్యాలెండర్స్
క్యాలెండర్ ప్రకారమే ఈ సంప్రదాయం మొదలైందని కొందరు విశ్వసిస్తున్నారు. రోమన్ కాలంలో కొనసాగింపు పండుగలు ఉండేవి. సాధారణంగా నూతన సంవత్సరానికి కొనసాగింపుగా కొన్ని పండుగలు జరుపుకునేవారు. ఈ పండుగలు చాలా సరదాగా ఉండేవి. ‘ఈ పండుగలప్పుడు పనివాళ్లు యజమానులను, పిల్లలు తల్లిదండ్రులను ఆటపట్టించొచ్చు..’ అని ఆండ్రియా అన్నారు. అలాంటి ఓ పండుగే ఫూల్స్ డేగా స్థిరపడిందని విశ్వాసం
మూడో కథ – యూరప్‌లో చేపల వేట
ఏప్రిల్ 1 గురించి నిర్దిష్టమైన ఆధారాలను ఫ్రాన్స్, హాలండ్‌లోని 16వ శతాబ్దం అందిస్తోంది. అందుకే ఈ పండుగ ఉత్తర ఐరోపా సంప్రదాయమని, అక్కడి నుంచి బ్రిటన్‌కు వచ్చిందని భావిస్తారని ఆండ్రియా తెలిపారు. యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆ రోజును ‘ఏప్రిల్ ఫిష్ డే’గా పిలుస్తారు. ఈ సమయంలో ఫ్రాన్స్‌లోని కాలువలు, నదుల్లో చేపలు ఎక్కువగా దొరుకుతాయి. వాటిని పట్టడం సులువుగా ఉంటుంది. దాంతో సులువుగా దొరికే చేపలను ఎడ్డి చేపలుగా భావిస్తారు. కాబట్టి మనుషులను ఆ వెర్రి చేపలతో పోలుస్తూ, ఆటపట్టిస్తూ.. ఏప్రిల్ 1ను ఫూల్స్ డేగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది. కాగా, ఫ్రాన్స్‌లో ఇప్పటికీ ఈ ఏప్రిల్ 1న చేపలకు ప్రాధాన్యం ఉందని ఆండ్రియా తెలిపారు. ఆ రోజున అందర్నీ ఆటపట్టించడానికి పేపర్ చేపలను తయారుచేసి, వాటిని చప్పుడు కాకుండా ఇతరుల వీపుపై అతికిస్తారని, లేదంటే ‘చాకొలేట్ ఫిష్’లను బహుమతిగా ఇస్తారని ఆమె వివరించారు. కానీ అసలు ఏప్రిల్ 1ననే ఈ ఫూల్స్ డే జరపడం ఎప్పుడు మొదలైందంటే కచ్చితంగా చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం.. ఏప్రిల్ 1న జోకులు వేసుకోవడం, అందర్నీ ఆటపట్టించడం అన్నది మాత్రం చాలా కాలంగా వస్తోంది