Back From Death | అంత్యక్రియలకు సిద్ధం చేసిన శవపేటికలో చప్పుళ్లు.. కట్ చేస్తే!
కొన్ని సంఘటనలు గుండెలను గుభేల్మనిపిస్తాయి. తాము చూస్తున్నది నిజమో అబద్ధమో తెలియని స్థితికి నెట్టేస్తాయి. ఆ సమయంలో కలిగే భయం.. ఒక్కొక్కళ్లను ఒక్కో దిక్కు పరుగులు పెట్టిస్తాయి. అటువంటి ఘటన ఒకటి థాయిలాండ్‌లో ఇవే పరిస్థితులను సృష్టించింది.
Back From Death | ఈ ఘటన బ్యాంకాక్ వెలుపలి నోంథాబురిలో ఉన్న బౌద్ధ ఆలయం ‘వాట్ రాట్ ప్రఖోంగ్ థామ్’లో చోటు చేసుకున్నది. అక్కడి ఆలయ సిబ్బంది రొటీన్‌గా నిర్వహించే అంతక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. థామ్ వ్యవహారాలు చూసే పైరత్ సూద్‌తూప్ చెప్పిన దాని ప్రకారం.. 65 ఏళ్ల మహిళ చనిపోయిందంటూ ఆమె కుటుంబీకులు తెల్లని వస్త్రాల్లో చుట్టి శవపేటికలో పెట్టుకుని తీసుకువచ్చారు. అప్పటికే ఆమెకు తుది వీడ్కోలు కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే.. అంత్యక్రియల సందర్భంగా ఆ పెట్టె నుంచి శబ్దాలు వచ్చాయి. శవపేటిక ఒక్కసారిగా కదలడం మొదలైంది. దీంతో ఆలయ సిబ్బంది గుండెలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారు.
‘మొదటగా శవపేటికను లోపలి నుంచి తడుతున్నట్టు శబ్దాలు వినిపించాయి. తొలుత భ్రమ అనుకున్నాం. మళ్లీ శబ్దం వినిపించింది. దాంతో నేను శవపేటికను తెరుద్దామని ఆమె కుటుంబీకులకు చెప్పాను. తీరా తెరిచి చూస్తే ఆశ్చర్యం. అంతా అవాక్కయ్యారు’ అని సూద్‌తూప్ గుర్తు చేసుకున్నారు. ‘ఆమె తన కళ్లు మెల్లగా తెరిచేందుకు ప్రయత్నిస్తూ శవపేటికను తడుతున్నది. చాలా సేపటి నుంచే ఆమె ఇలా కొడుతున్నదేమో. శవపేటికలోపల చీకటిలో నిశ్శబ్దంలో ఉన్న ఆమె.. బయట ఉన్నవారిని అప్రమత్తం చేసేందుకు చాలా సేపటి నుంచి ప్రయత్నిస్తున్నదని అర్థమైంది’ అని ఆయన చెప్పారు.
నిజానికి ఈ 65 ఏళ్ల మహిళ సుమారు రెండేళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితం అయింది. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఎలాంటి స్పందనలు లేవు. రెండు రోజులపాటు శ్వాస కూడా ఆగిపోవడంతో ఆమె కాలం చేసిందనే అభిప్రాయానికి వచ్చామని ఆమె సోదరుడు తెలిపారు. ‘మరణానంతర తన అవయవాలను దానం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ విషయం గతంలోనే మాకు చెప్పింది. అందుకే తాము ఆమె బాడీని బ్యాంకాక్‌లోని హాస్పిటల్‌కు తీసుకు వెళదామని ప్లాన్ చేశాం. అయితే.. డెత్ సర్టిఫికెట్ లేనిదే అవయవాలను సేకరించలేమని హాస్పిటల్ స్టాఫ్ చెప్పారు. దీంతో చేసేదిలేక ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించే ఆలయ సిబ్బందిని సంప్రదించాం. దానికి నిర్ణీత డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుందని వాళ్లు చెప్పారు’ అని ఆమె సోదరుడు తెలిపారు. ఆ పత్రాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో శవపేటిక నుంచి శబ్దాలు రావడం మొదలైంది. పేటికను తెరిచి చూడగా.. ఆమె ప్రాణాలతోనే ఉన్నట్టు తేలడంతో ఆమెను వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించారు. అంతేకాదు.. ఆమె వైద్యానికి అయ్యే ఖర్చును భరించేందుకు ఆలయ అధికారులు హామీ పత్రాన్ని అందించారు. మొత్తానికి చనిపోయిందనుకున్న ఆ మహిళ బతకడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram