బీజేపీలోని బండి వ్యతిరేక బ్యాచ్‌కు కలిసొచ్చిన భగీరథ్‌ పోక్సో ఎపిసోడ్‌!

బండి సంజయ్‌ కుమారుడి వ్యవహారం.. బీజేపీలోని ఆయన వ్యతిరేకులకు టైమ్‌కు కలిసొచ్చిన అంశమా? ఆధిపత్య పోరులో భాగంగా బండికి సెగ పెట్టేందుకు, రచ్చ చేసేందుకు బీజేపీలోని ఒకరిద్దరు నాయకులు ఈ ఎపిసోడ్‌ను వాడుకుంటున్నారా?

విధాత, హైదరాబాద్:

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు బండి సాయి భగీరథ్ పేరు మారు మోగుతున్నది. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఆయనపై పోక్సో కేసు నమోదు కావడడంతో ఆయన తండ్రి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై సోషల్‌ మీడియా హోరెత్తుతున్నది. నలుగురు కలిసిన చోటల్లా ఇదే అంశం గురించి చర్చించుకుంటున్నారు. గతంలో జరిగిన ఈ ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు రెండు రోజుల ముందు తెరమీదికి తీసుకురావడం, రచ్చ చేయడం వెనకాల సొంత పార్టీ నేతల కుట్ర ఉందనే అనుమానాలు సంజయ్ అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రచ్చతో సంజయ్ మంత్రి పదవికి ఎసరు వచ్చేలా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు పోలీసుల అరెస్టు నుంచి సాయి భగీరథ్ తప్పించుకున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తమై సిట్ వేయడం, ఆ సిట్‌ భగీరథ్‌కు నోటీసులు జారీ చేయడం, మరోవైపు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేయడంతో సీరియస్ అంశంగా మారింది. కేసును కొట్టివేయాలని భగీరథ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఏం జరుగుతుందో నంటూ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కేసు మున్ముందు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందోనన్న భయం బీజేపీ శ్రేణులను వెంటాడుతున్నది.

పోలీసులు వెల్లడించిన వివరాలు, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం బండి సాయి భగీరథ్ కేసు తెలంగాణ పోలీసులకు సవాలుగా మారింది. మే 8వ తేదీన భగీరథ్, మైనర్ అమ్మాయి తల్లిదండ్రులు పోటాపోటీగా పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టారు. తనను డబ్బులు డిమాండ్ చేస్తున్నదని, హానీ ట్రాప్‌ అంటూ భగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే.. తన మైనర్‌ కుమార్తెను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఆమె తల్లి పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. గంటల తరబడి వెయిట్‌ చేయించిన పోలీసులు.. కరీంనగర్‌లో కేసు నమోదైన తర్వాత తాపీగా ఈ ఫిర్యాదు స్వీకరించడం గమనార్హం.

డామేజ్‌ ఇప్పటికే అయిపోయింది..

భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం ఆయన తండ్రి బండి సంజయ్‌కు కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు సరిగ్గా రెండు రోజుల ముందు సడన్‌గా ఈ అంశం తెరమీదికి వచ్చింది. రెండు రోజుల వ్యవధిలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తొలుత సాయి భగీరథ్ ఫిర్యాదుపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ బయటకు రాగా, మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ మాత్రం బయటకు రాలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆ అంశం హోరెత్తింది. ప్రజల నుంచి, ప్రతిపక్ష పార్టీల మహిళల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడం, మహిళలు డీజీపీ కార్యాలయం ముట్టడించడం వంటి ఘటనలతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. బండి కుమారుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని, పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయడం లేదంటూ విమర్శల ధాటి పెరిగింది.

బీజేపీలోని నేతలకు అందివచ్చిన అవకాశం?

బీజేపీలోని ఒకరిద్దరు నేతలకు ఈ అంశం అంది వచ్చిన అవకాశంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దానిని చక్కగా వినియోగించుకున్నారని అంటున్నారు. ఈ గొడవకు ఆజ్యం పోసే విధంగా కొందరు నేతలు తెర వెనకాల చక్రం తిప్పారని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. బండి సంజయ్ కోలుకోని విధంగా సోషల్ మీడియాలో హోరెత్తించారంటున్నారు. పనిలోపనిగా అది బీజేపీ వ్యతిరేకతను కూడా రాజేస్తున్నది. ఈ హోరు జాతీయ స్థాయికి కూడా వెళ్లింది. పలు జాతీయ టీవీ చానళ్లలో కూడా ప్రసారం అవుతోంది. దీంతో తమ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదనే విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకావాల్సిన పరిస్థితులను సోషల్ మీడియా కల్పించడం, ప్రతిపక్షాలు విమర్శించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగక తప్పలేదు. ప్రధాని పర్యటన ముగిసిన మరుసటి రోజు డీజీపీ సీవీ ఆనంద్‌ను పిలిపించి మాట్లాడారు. భగీరథ్ కేసులో విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కూడా భగీరథ్‌కు నోటీసులు జారీ చేసింది. ఆ తరువాత కూకట్‌పల్లి డీసీపీ రుతిరాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడం, ఆమె పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ సందర్శించి సమీక్షించడం వెంటవెంటనే జరిగిపోయాయి. పరిస్థితి చేయి దాటిందని గమనించి భగీరథ్ బెయిల్ కోసం మంగళవారం హైకోర్టు గడప తొక్కారు. ఈ పిటిషన్ ను ఈ నెల 14 వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మైనర్ బాలికతో పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు తిరగడం, పెళ్లి చేసుకోవాలని నిలదీస్తే బెదిరింపులకు గురి చేయడంతో కొన్ని రోజులు మౌనంగా ఉన్న బాలిక కుటుంబం న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడంతో కథ మొత్తం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసేందుకు ఆరేడు గంటలు కూర్చోబెట్టడంతో విసుగు చెందిన బాలిక తల్లిదండ్రులు ఆల్టిమేటం జారీ చేశారు. పోక్సో కేసు నమోదు చేస్తారా? లేదంటే నరేంద్ర మోదీ సభలో ఆత్మాహుతికి పాల్పడతామని బెదిరించడంతో ఎట్టకేలకు పోక్సో కేసు పెట్టారని సమాచారం. కేసు పెట్టకుండా రాజీ చేసుకోవాలని బీజేపీ నేత, మాజీ జర్నలిస్టు ఆ కుటుంబంతో రాయబారం నడిపినప్పటికీ వారు విన్పించుకోలేదని తెలుస్తున్నది.

బీజేపీ కీలక నేత ఎంటర్‌

ఈ కేసు వివరాలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడటంతో బీజేపీ సీనియర్ నేత ఒకరు రంగంలోకి దిగారని సమాచారం. సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించి, రచ్చరచ్చగా మార్చారంటున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసు సంజయ్ మంత్రి పదవికి ముప్పుగా పరిణమించిందని, ఢిల్లీ బీజేపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పోలీసుల అరెస్టు నుంచి కుమారుడిని తప్పించారన్న అపవాదును సంజయ్ ఎదుర్కొంటున్నారు. పోక్సో కేసులో బెయిల్ వచ్చే పరిస్థితి లేనందున ఏ క్షణమైనా సంజయ్ రాజీనామా చేయవచ్చని అంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, సంజయ్‌కు బాసటగా నిలవడమే కాకుండా వీడియో సందేశం కూడా ఇచ్చారు. కేసు విచారణ దశలో ఉండగా రాజీనామా చేయాలని కోరడం సరైంది కాదని, రాజకీయంగా దెబ్బతీసే కుట్ర అని అన్నారు. సిట్ విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయన్నారు.

రాష్ట్ర బీజేపీలో ఆధిపత్యపోరు

రాష్ట్ర బీజేపీలో ఆధిపత్య పోరులో భాగంగానే ఒకరి తరువాత ఒకరిని పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారం వినిపిస్తున్నది. కట్టర్ బీజేపీవాదిగా ఉన్న రాజా సింగ్‌ను బయటకు పంపించారు. ఆయన బీజేపీలో ఉన్నారా, హిందుత్వవాదా అనేది తేల్చుకోలేని పరిస్థితిని కల్పించారు. రాష్ట్రంలో బీజేపీకి గుర్తింపు తీసుకురావడం, ఓటు బ్యాంకును పెంచడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మింగుడు పడని నాయకుడిగా బండి సంజయ్ తయారైన విషయం ప్రజలందరికీ తెలిసిందే. పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని కట్టర్ బీజేపీ అగ్రనేతలకు మంచి టైమ్‌కు భగీరథ్‌ అకృత్యాల రూపంలో భారీ అస్త్రం దొరికిందనే చర్చలు సాగుతున్నాయి. ఈ కేసు విషయంలో సంజయ్ కూడా తన కుమారుడిని వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు తప్పితే, మైనర్ బాలిక కుటుంబం పట్ల మర్యాదగా వ్యవహరించలేదనే విమర్శలు మహిళల నుంచి ఎదుర్కొంటున్నారు. తప్పు జరిగిన తరువాత పెద్ద మనిషి తరహాలో సరిదిద్దితే పరిస్థితి చేయి దాటి వెళ్లేది కాదని బీజేపీ మహిళా కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు.

నా కొడుకు తప్పు చేయలేదు.. చేస్తే క్షమించను..

తన కుమారుడు సాయి భగీరథ్‌ను నేరస్తుడిలా చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బండి సంజయ్‌ వాపోయారు. ఏ తప్పు చేయలేదని తన కుమారుడు తనతో చెప్పాడన్న బండి.. తప్పు చేస్తే కొడుకు అయినా క్షమించబోనని, శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు. తన కుమారుడికి సమయం ఇవ్వకుండా తప్పు చేశానని, తప్పు తనదేనంటూ క్షమాపణలు కోరారు. మంగళవారం తన కుమారుడి పోక్సో కేసు, ప్రతిపక్షాల విమర్శలపై సంజయ్ స్పందించారు. చట్టం, న్యాయం గౌరవిస్తానని, తప్పు ఎవరు చేసినా సమర్థించేది లేదన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. తన కుటుంబంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా రాళ్లు చేస్తున్నారని, కన్న పేగు తల్లడిల్లుతోందని గద్గద స్వరంతో చెప్పారు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలి పెట్టేది లేదంటూ శపథం చేశారు. ‘సంజయ్‌ను కెలికారు.. మీరు పెట్టిన నిప్పు మీకే అంటుకుంటుంది..’ అంటూ శాపనార్థాలు పెట్టారు.

Latest News