Maoist Party | మావోయిస్టులపై యుద్ధమేనా?.. రేవంత్, బండి మాటల వెనుక?
కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ ను తుద ముట్టించే విషయంలో కఠినంగా ఉండడంతో ప్రాంతీయ పార్టీలు కూడా తటస్థ వైఖరిని అవలంబిస్తున్నాయి. ఈ పరిణామాలు కూడా మావోయిస్టు పార్టీకి ప్రతిబంధకంగా మారాయనే చెప్పాలి.

హైదరాబాద్, విధాత ప్రతినిధి:
2026వ సంవత్సరం మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను ఏరివేస్తామని, నక్సలిజం అనేదే లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి పదే పదే ఉద్ఘాటిస్తున్నారు. మరోవైపు ఆ మాటలను నిజం చేస్తూ భద్రతా బలగాలు వరుస ఎన్ కౌంటర్లతో అడవుల్లో నెత్తుటేర్లు పారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన వ్యాఖ్యలకు అనుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కఠినంగా ఉంటామని స్పష్టం చేయడం గమనార్హం.
మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. దేశవ్యాప్తంగా నక్సలిజం విస్తరించడంలో తమవంతు పాత్ర పోషించారు. దేశంలో క్యాపిటలిజం పెరగడం, కార్పొరేట్ కంపెనీల రాకతో యువత అటువైపుగా ఆకర్షితులు కావడం లేదు. కొత్త రిక్రూట్ మెంట్ లేకపోవడం, మైదాన ప్రాంతాల్లో బలపడేందుకు ప్రయత్నం చేయకపోవడం వంటి కారణాలు కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో సహజ వనరులు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ వనరులను కొల్లగొట్టేందుకు క్యాపిటలిస్టులు వ్యూహం పన్నారని, వారు రాజకీయ నాయకుల సహాయం తీసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇందుకోసమే ఆపరేషన్ కగార్ అమలు చేస్తున్నారని మానవ హక్కుల సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు విమర్శిస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంతో పాటు మెజారిటీ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ ను తుద ముట్టించే విషయంలో కఠినంగా ఉండడంతో ప్రాంతీయ పార్టీలు కూడా తటస్థ వైఖరిని అవలంబిస్తున్నాయి. ఈ పరిణామాలు కూడా మావోయిస్టు పార్టీకి ప్రతిబంధకంగా మారాయనే చెప్పాలి.
తెలంగాణ నేతలు సాయుధ వర్గాలతో సంబంధాలు తెంచుకోవాలన్న బండి
రెండు రోజుల క్రితం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపాయి. ప్రజల ముందు ప్రజాస్వామ్యం గురించి చెబుతూ, అంతర్గతంగా మావోయిస్టులకు మద్ధతిస్తున్న తెలంగాణ నేతలు వెంటనే సాయుధ వర్గాలతో ఉన్న సంబంధాలు, అనుబంధాలు తెంచుకోవాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అలా చేయని పక్షంలో మీ గుట్టు రట్టు చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ల నాయకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్టుల నిర్మూలనకే పరిమితం కావడం లేదన్నారు. ఉగ్రవాద సంబంధాల నెట్ వర్క్, నేర సామ్రాజ్యం, అవినీతి పట్ల కఠినంగా ఉన్నారన్నారు. దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి దయ, కనికరం అనేది ఉండదని, మావోయిస్టుల వైపు నిలబడితే కేంద్రం ఎవరినీ క్షమించదన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక అడుగు ముందుకు వేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్ర రావు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్న రాజకీయ నాయకులను విచారించాలని డిమాండ్ చేశారు. వచ్చే మార్చి నాటికి దేశంలో నక్సలిజం ముగుస్తుందని, నక్సలైట్ల ప్రభావిత జిల్లాలు 125 నుంచి 11 జిల్లాలకు తగ్గిందని కేంద్ర గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి అన్నారు.
మేమూ కఠినంగానే ఉంటాం… రేవంత్ రెడ్డి
సంఘ వ్యతిరేక శక్తుల పట్ల తామూ కఠినంగానే ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే అని, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. గోషామహాల్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయారని, అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాన్ని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత, ఏరివేత వైఖరికి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వం కూడా సరిహద్దు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అటవీ ప్రాంతాలలో చత్తీస్ గఢ్ తో కలిసి సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తున్నది. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఉద్యమ బలహీనతకు కారణాలు ఇవే
మావోయిస్టులలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. వారం క్రితం అగ్ర నాయకులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు, తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న.. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరిని విప్లవ ద్రోహులుగా ప్రకటిస్తూ అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. వీరిని ప్రజలు శిక్షిస్తారని కూడా ఆయన ప్రకటించారు. నాలుగు రోజుల క్రితం 208 మంది మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ లో లొంగిపోవడం సంచలనం అయ్యింది. అంతం ఆసన్నమైందా అనే విధంగా లొంగుబాట్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ వ్యూహం నుంచి చిన్న క్యాడర్ నుంచి పెద్ద క్యాడర్ వరకు తప్పించుకోలేకపోతున్నారు. అక్టోబర్ 15న మల్లోజుల వేణుగోపాల్ సహా 61 మంది లొంగిపోయారు. కేంద్ర బలగాల జల్లెడ, టెక్నాలజీ పెరగడం, అగ్రనేతల వయోభారం వంటి కారణాలతో ఉద్యమానికి దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకుండా పోయింది. బీజేపీ పదేళ్ల పాలనలో దేశంలో 15 మంది మావోయిస్టు అగ్రనేతలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. చత్తీస్ గఢ్, ఝార్ఖండ్, బీహార్ సరిహద్దులలో మావోయిస్టులకు పట్టు లేకుండా చేయడంలో విజయవంతం అయ్యారు. 2014 లో బీజేపీ వచ్చే నాటికి మావోయిస్టు సంబంధిత పోలీసు స్టేషన్లు 330 ఉండగా, ఇప్పుడు 104కే పరిమితం అయ్యయి. గత ఐదేళ్లలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో 302 కొత్త భద్రతా శిబిరాలు, 68 నైట్ ల్యాండింగ్ ఏర్పాటు చేసి అడుగడుగూ కూంబింగ్ చేస్తున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, కోబ్రా బెటాలియన్లు, రాష్ట్రాల పోలీసులు చేస్తున్న తనిఖీల మూలంగా మావోయిస్టులకు నిద్ర కరువై సురక్షిత స్థావరాలు దొరక్క లొంగుబాట పడుతున్నారని అంటున్నారు.