భగీరథ్ దురాగతంపై కమల నారీమణుల మౌనం.. నోళ్లకు ప్లాస్టర్ వేశారా అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు

మహిళలపై అన్యాయాలు జరిగితే మీడియా ముందుకు వచ్చి ఖండించే బీజేపీ మహిళా నాయకులు.. బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారన్న ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి.

  • By: TAAZ |    telangana |    Published on : May 14, 2026 10:00 AM IST
భగీరథ్ దురాగతంపై కమల నారీమణుల మౌనం.. నోళ్లకు ప్లాస్టర్ వేశారా అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు
  • సోషల్ మీడియాలో తిట్ల దండకం
  • ఇంకా స్పందించని సురేఖ, సీతక్క

విధాత, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో బీజేపీకి చెందిన మహిళా నాయకురాళ్లు అయిన దానికి కానిదానికి సోషల్ మీడియాలో విపరీత ప్రచారానికి దిగుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. మహిళలపై ఎక్కడైనా అన్యాయం జరిగితే గంటల వ్యవధిలో స్పందించి, సవాళ్లు ప్రతి సవాళ్లు చేసే మహిళా నాయకురాళ్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ విషయంలో నోరు మెదపడం లేదన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఏ ఒక్క మహిళా నాయకురాలు కూడా సామాజిక మాధ్యమాల్లో ఖండించే సాహసం చేయలేదు. పైగా కొందరు ఎదురు వాదనలకు దిగుతున్నారు. బాధితురాలిదే తప్పన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ‘మీ నోళ్లకు పార్టీ నాయకత్వం ప్లాస్టర్లు వేసిందా?’ అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ‘ప్రతిపక్షాలపై ఆడిపోసుకునే మీరు భగీరథ్ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ వారు ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని, విపక్షాలు తప్పులు చేస్తే మాత్రం సూటిపోటీ మాటలతో విమర్శిస్తారా? ప్రతిపక్ష పార్టీలకు చెందిన మహిళా నాయకురాళ్లు ప్రశ్నిస్తున్నారు.

హాట్‌ టాపిక్‌గా భగీరథ్‌పై పోక్సో కేసు

బండి సాయి భగీరథ్ పై నమోదు అయిన ఫోక్సో కేసు, తదనంతర పరిణాలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ అంశాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఉపయోగించుకుని బీజేపీ నేతల వైఖరిని తూర్పారబడుతున్నారు. డీజీపీ కార్యాలయం ముట్టడించడం, బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతోపాటు.. పోక్సో కేసు తరువాత భగీరథ్ దేశం విడిచి పారిపోయాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే బీజేపీలో మహిళా నాయకురాళ్లుగా చలామణి అవుతున్న ఏ ఒక్కరు కూడా ఈ దురాగతంపై స్పందించడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోసే వారిలో సుంకర మౌనిక, ప్రియా చౌదరి, కొంపెల్లి మాధవీలత, కరాటే కళ్యాణి, యాక్టర్ మాధవీలత ముందు వరుసలో ఉంటారు. హిందూ మతం గురించి పుంఖాను పుంఖానులుగా మాట్లడతారు. ఇక ఇతర మతాలపై విమర్శల గురించి చెప్పాల్సిన పనే లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మీదికి లగెత్తుకుని వచ్చే వీళ్లు ఎక్కడికి పోయారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తుతున్నాయి. ‘ఎండలు కదా చల్లగా రెస్టు తీసుకుంటున్నారు’ అని కొందరు, ‘వీళ్లు మతం ముసుగు తొడిగిన మోసకారులు, వీళ్లకు సొంత పార్టీ వాళ్ల దురాగతాలు కన్పించవు’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అదే ఎవరైనా ముస్లిం లేదా క్రిస్టియన్‌ ఈ పనిచేసి ఉంటే.. ఈ పాటికి లగెత్తుకుని వచ్చి మీడియా ముందు నానా యాగి చేసేవారని అంటున్నారు. ‘వీళ్ల నరాలు కట్ అయి స్పందన కోల్పోయారేమో, ఏమనాలతో తెలియక మ్యూట్ లో ఉన్నారు’ అంటూ పలు రకాలుగా సోషల్ మీడియాలో బీజేపీ మహిళా నాయకురాళ్లపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ దురాగతంపై మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా కనీసం స్పందించకపోవడం, బాధిత బాలికకు సాంత్వన చేకూర్చకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

పోరాటంలో ముందున్న బీఆర్ఎస్ మహిళలు

బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాళ్లు రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శిని కలిసి వినతి పత్రం అందచేశారు. నిందితుడికి శిక్ష పడాల్సిందేనని, బాధితురాలికి రక్షణ కల్పించాలని కోరారు. బాధితురాలికి అండగా ఉండాల్సిన పోలీసులు రివర్స్ కేసులతో భయాందోళనలకు గురి చేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా నాయకురాళ్లు ఆందోళనలు చేశారు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయాన్ని, పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ ను ముట్టడించారు. ఫ్లకార్డులు పట్టుకుని స్టేషన్ ముందు ధర్నా చేశారు.

మౌనంగా మంత్రులు సురేఖ, సీతక్క

భగీరథ్ పై నమోదు అయిన పోక్సో కేసుపై ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్పందించకపోవడం మహిళలను ఆగ్రహానికి గురి చేస్తున్నది. కేంద్ర మంత్రి సంజయ్ కుటుంబం పట్ల ఎందుకంత సాఫ్ట్ గా ఉంటున్నారో అర్థం కావడం లేదనే చర్చ ప్రజల్లో జరుగుతున్నది. మాజీ మంత్రి కేటీఆర్ పై అంతెత్తు ఎగిరెగిరి విమర్శలు చేసిన ఇద్దరూ ఇప్పుడు నోరెందుకు మెదపడం లేదంటున్నారు. కేటీఆర్‌ను వ్యక్తిగతంగా తూలనాడిన సురేఖ, పోక్సో కేసులో బాధిత బాలికను కనీసం పరామర్శించకపోవడం దారుణమంటున్నారు. సీతక్క కూడా బాధిత కుటుంబాన్ని ఓదార్చకపోవడం విడ్డూరంగా ఉందంటున్నారు. హనుమాన్ జయంతి రోజున సికింద్రాబాద్ తాడ్ బండ్ హనుమాన్ దేవాలయంలో పూజలు చేసిన సురేఖకు, సమీపంలో ఉన్న బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు తీరిక లేదా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మౌన దీక్ష వెనకాల ఉన్న మతలబు ఏంటని కాంగ్రెస్ నాయకులే ఆశ్చర్యపోతున్నారు.

Read Also |

తెలంగాణకు వాతావరణ శాఖ ‘రెడ్​ సిగ్నల్’ : 44 డిగ్రీలు దాటనున్న ఎండలు
Apple Farming | కరువు నేలలో ఆపిల్ సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన మహారాష్ట్ర రైతు!
భగీరథ్ దేశం వదిలిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలి : టీఆర్ఎస్ చీఫ్ కవిత