తెలంగాణకు వాతావరణ శాఖ ‘రెడ్​ సిగ్నల్’ : 44 డిగ్రీలు దాటనున్న ఎండలు

ఇప్పటికే ఎండలతో విలవిలలాడుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ మరో తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44°C దాటనున్నాయని రెడ్​ అలర్డ్​ పంపింది. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణకు వాతావరణ శాఖ ‘రెడ్​ సిగ్నల్’ : 44 డిగ్రీలు దాటనున్న ఎండలు తెలంగాణలో మండిపోతున్న ఎండలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

Telangana Heatwave Red Alert: IMD Warns Temperatures May Cross 44°C

  • రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్.. మరింత ఉగ్రరూపం దాల్చనున్న వడగాలులు

విధాత వాతావరణం డెస్క్​ | మే 13, 2026 | హైదరాబాద్​:

తెలంగాణలో ఎండలు రోజురోజుకూ భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదవుతుండగా, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ ఐఎండీ హైదరాబాద్ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.

నిప్పుల కొలిమిలో ఉత్తర తెలంగాణ జిల్లాలు

Women protecting themselves from scorching heat on Telangana roads

ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. పెరుగుతున్న వడదెబ్బ ముప్పు

తాజా వాతావరణ బులెటిన్ ప్రకారం తెలంగాణవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశముంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతోందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం నుంచి ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేశారు. ఈ జిల్లాల్లో మూడు నుంచి నాలుగు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు కొనసాగే అవకాశముందని పేర్కొన్నారు.

అంతేకాకుండా శనివారం నాటికి జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్క్‌ను దాటవచ్చని తెలిపింది. వారాంతానికి కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు అగ్నిగుండాలను తలపించనున్నాయి.

హైదరాబాద్​లోనూ మండిపోనున్న ఎండలు.. 

Street vendor pushing cart on empty road during intense summer heat

మండుతున్న ఎండల మధ్య నిర్మానుష్యంగా మారిన రహదారులు

ఇప్పటివరకు 36 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్న హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ వంటి జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు పెరగనున్నాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో కాంక్రీట్ నిర్మాణాలు, వాహనాల కాలుష్యం కారణంగా వేడి మరింత అధికంగా అనిపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, గుండె మరియు మధుమేహ సమస్యలతో బాధపడుతున్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మధ్యాహ్నం బయటికెళ్తే మరణశాసనమే

Women covering faces while walking under extreme heatwave conditions in Telangana

తెలంగాణలో తీవ్ర వడగాలులు.. ఎండ నుంచి తప్పించుకోవడానికి తిప్పలు

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలని, పలుచటి నూలు​ దుస్తులు ధరించాలని, నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకూడదని సూచించారు. బయట పనులు చేసే కార్మికులు, రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అవసరమైన చోట తాగునీటి సదుపాయాలు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.