Musi River । కాలుష్యం బారి నుంచి మూసీ నదిని ప్రక్షాళన చేయడంలో ఎవరి బాధ్యత ఎంత?

మూసీ నది ఇంత కాలుష్యంలో కూరుకుపోవడానికి కారకులెవరు? దర్జాగా కబ్జాలు జరిగినా పట్టించుకోనిది ఎవరు? గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసివారు మూసీ ప్రక్షాళన కోసం దశాబ్దాల కాలంలో చేసిన పనులేంటి? అయినా ఇంకా మూసీ కాలుష్యకాసారంగానే ఎందుకు కునారిల్లుతున్నది?

Musi River । కాలుష్యం బారి నుంచి మూసీ నదిని ప్రక్షాళన చేయడంలో ఎవరి బాధ్యత ఎంత?

Musi River । అది 1908వ సంవ‌త్స‌రం.. నాటి హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌ర జ‌నాభా 4.40 ల‌క్ష‌లు. మూసీ న‌ది(Musi River)లో క‌బ్జాలు లేవు, స్వ‌చ్ఛ‌మైన నీరు ఏడాది పొడ‌వునా పారేది. హైద‌రాబాద్ న‌గ‌రంలో అడుగ‌డుగునా చెరువు(ponds)లే… అన్ని చెరువుల‌కు లింక్ కాలువ‌లు (link canals) ఉన్నాయి… అయినా ఆనాడు కురిసిన భారీ వ‌ర్షానికి హైద‌రాబాద్ న‌గ‌రం అత‌లాకుత‌లమైంది. 50 వేల మంది ఈ వ‌ర‌ద‌ల్లో (floods) చ‌నిపోయారని అంచనా. 80 వేల ఇండ్లు నేల మ‌ట్టం అయ్యాయి. 1860లో మూసీపై నిర్మించిన మూడు బ్రిడ్జీ(bridges)లు ఈ వ‌ర‌ద‌ల్లో కొట్టుకు పోయాయి. 12,50,000 పౌండ్ల ఆస్తి న‌ష్టం వాటిల్లిందని లెక్కగట్టారు. హైద‌రాబాద్ న‌గ‌ర జ‌నాభాలో నాలుగ‌వ వంతు ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు.

న‌గ‌రం విస్త‌రించి మ‌హాన‌గ‌రం (metropolis) అయింది. న‌గ‌ర జ‌నాభా కోటి దాటింది. నాటి చెరువులు నేడు క‌నుమ‌రుగయ్యాయి. జీహెచ్ఎంసీ (GHMC) ప‌రిధిలో 185 చెరువులు ఉంటే వాటిల్లో 134 క‌బ్జాకు గుర‌య్యాయి. చెరువుల‌ను లింక్ చేసే వ‌ర‌ద కాలువ‌లు కూడా క‌బ్జా (encroached) అయ్యాయి. మూసీలో గండిపేట నుంచి నాగోల్ వ‌ర‌కు అడుగ‌డుగునా క‌బ్జాలే.. మూసీ రివ‌ర్‌ బెడ్‌, బ‌ఫ‌ర్ జోన్లలోనే లక్ష‌ల మంది ప్ర‌జ‌లు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. పైగా కాలుష్య (polluted) కాసారంగా మారిన మూసీ నేడు మ‌న‌కు ద‌ర్శ‌నం ఇస్తోంది.

కేవ‌లం నాలుగు ల‌క్ష‌ల జ‌నా భా ఉన్న న‌గ‌రానికి 1908 సెప్టెంబ‌ర్‌లో భారీ వ‌ర‌ద (heavy flood) వ‌స్తే జ‌రిగిన న‌ష్టం అంతా ఇంతా కాదు.. అలాంటి వ‌ర‌ద‌లు ఇప్పుడు మూసీ వ‌స్తే జ‌రిగే న‌ష్టం ఎలా ఉంటుందో మ‌నం ఊహించ‌గ‌ల‌మా? వాతావ‌ర‌ణంలో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా భూతాపం (Global warming) పెరిగింది. వ‌స్తే క‌రువు.. లేదంటే క్లౌడ్‌బ‌ర‌స్ట్‌లే అవుతున్నాయి. క్లౌడ్ బ‌ర‌స్ట్‌ (cloudbursts) మూలంగా ఈ ఏడాది మున్నేరు వ‌ర‌ద‌ ఖ‌మ్మం ప‌ట్ట‌ణాన్ని ముంచెత్తింది. ఏపీలో బుడ‌మేరు వ‌ర‌ద‌ (Budameru floods) విజ‌య‌వాడ‌ను ముంచింది. కేర‌ళ‌లోని వాయనాడ్‌లో చోటు చేసుకున్న విధ్వ‌సం అంద‌రికీ తెలిసిందే. గ‌త ఏడాది జ‌య‌శంక‌ర్ భూపాల్ ప‌ల్లి జిల్లాలో మోరంచ‌ప‌ల్లి వాగు  (Moranchapalli stream) ఉధృతికి గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. కాగా ఇటీవ‌లే ములుగు జిల్లా తాడ్వాయి అడ‌వుల్లో (Tadwai forests) ప్ర‌కృతి సృష్టించిన విధ్వంసంలో వేల ఎక‌రాల్లో చెట్లు కూలిపోయిన విష‌యం మ‌న క‌ళ్ల‌ముందే క‌నిపిస్తోంది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంపై ఇలాంటి క్లౌడ్ బ‌ర‌స్ట్‌లు జ‌రిగితే మూసీ రివ‌ర్ బెడ్‌లో ఉన్న వాళ్లు, బ‌ఫ‌ర్ జోన్‌(buffer zone)లో ఉన్న ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏమిటీ?

జ‌ర‌గాల్సి న‌ష్టం అంతా జ‌రిగిన త‌రువాత నాయ‌కులు, ప్ర‌జా సంఘాల నేత‌లు వెళ్లి సానుభూతి తెలిపితే స‌రిపోతుందా? ల‌క్ష‌ల్లో న‌ష్టం జ‌రిగితే కుటుంబానికి ఒక రూ. 10 వేలు ఇచ్చి, ఒక్క పూట‌కు రేష‌న్ ఇస్తే ముంపుకు గురైన ప్ర‌జ‌ల బ‌తుకులు మార‌తాయా? అలాంటి వ‌ర‌ద‌ల ప్రాణ న‌ష్టం జ‌రిగితే నేత‌లు తిరిగి ప్రాణాలు తెచ్చి ఇవ్వ‌గ‌ల‌రా?.. మున్నేరులో నిండా మునిగిన ఖ‌మ్మం ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందించ వ‌చ్చునేమో కానీ జ‌రిగిన న‌ష్టాన్నంతా భ‌ర్తీ చేశారా? న‌ష్టం జరుగకముందే మేలుకొని న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డితే అంతా సంతోషంగా ఉంటారు క‌దా..!

మూసీలో 1.50 ల‌క్ష‌ల క్యూసెక్కుల వెళ్లేలా చ‌ర్య‌లు తీసుకోవాలని నీటిపారుద‌ల శాఖ (Irrigation Department) నివేదించింది. అత్య‌ధిక ప్ర‌వాహానికి మూసీలో నీటి మ‌ట్టం అత్య‌ధికంగా 504.81 మీట‌ర్ల నుంచి471.64 మీట‌ర్ల వ‌ర‌కు ఉంద‌ని తెలిపింది. ప్ర‌వాహం గరిష్ఠంగా ఉన్న‌ప్పుడు237.48 మీట‌ర్ల నుంచి128.33 మీట‌ర్ల వ‌ర‌కు విస్త‌రించే అవ‌కాశం ఉంద‌ని నీటి పారుద‌ల శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం మూసీని 237.48 మీట‌ర్ల వెడ‌ల్పు వ‌ర‌కు ఉండేలా చూడాల‌ని, అలా ఉంటేనే 1.50 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద నీరు సాఫీగా వెళుతుంద‌ని మూసీ రివ‌ర్ ఫ్రంట్‌(Moosi riverfront)కు నీటి పారుద‌ల శాఖ తెలియ‌జేసింది. ఈ మేర‌కు 45 ప్రాంతాల‌కు సంబంధించిన వివ‌రాలు అందించింది. గూగుల్‌లో కూడా రివ‌ర్ బెడ్‌ను రెడ్ లైన్‌తో, బ‌ఫ‌ర్ జోన్ ను బ్లూ లైన్‌తో చూపించింది.

వాస్త‌వంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో కబ్జాలు 1980వ ద‌శ‌కం నుంచే మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. న‌గ‌రంలో క‌బ్జా అయిన చెరువుల‌న్నీ ఈ 44 ఏళ్ల‌లోనే అని నివేదిక‌లు చెపుతున్నాయి. మూసీలో క‌బ్జాలు కూడా ఈ 44 ఏళ్ల‌లోనే పెరిగాయనేదాంట్లో సందేహం లేదు. మూసీతో పాటు హుస్సేన్ సాగ‌ర్ (Hussain Sagar) త‌దిత‌ర చెరువులు కూడా ఈ మ‌ధ్య కాలంలోనే కాలుష్యం బారిన ప‌డ్డాయి. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధికారంలోకి వ‌చ్చిన‌ త‌రువాత‌నే హైద‌రాబాద్ లో క‌బ్జాలు మొద‌ల‌య్యాయ‌న్న ఆరోప‌ణ‌లు కూడా బ‌లంగా వినిపిస్తున్నాయి.

మూసీకి వ‌చ్చే వ‌ర‌ద సాఫీగా వెళ్లాలంటే క‌బ్జాలు (encroachments) తొల‌గించాల్సిందే.. మ‌రో ప్ర‌త్యామ్నాయం లేదు. న‌దీ ప్ర‌వాహ గ‌మ‌నాన్ని మార్చే శ‌క్తి మ‌న‌కెవ‌రికీ లేదు.. మారాల్సింది మ‌న‌మే అనేది స్ప‌ష్టం. అయితే ఏవిధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌నేది ప్ర‌భుత్వాలు చేయాల్సిన ప‌ని…నిజంగా ప్ర‌జాక్షేమం కోరే పార్టీలు ఈ స‌మ‌స్య‌ను రాజ‌కీయాల‌కు అతీతంగా (beyond politics) నిర్ణ‌యం తీసుకొని మూసీ నిర్వాసితుల‌కు న్యాయం జరిగేలా చేయ‌డంతో పాటు.. వారి అంగీకారంతో వారిని అక్కడి నుంచి తరలించే చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంది. ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతుల‌కు గురికాకుండా చూడాల్సిన బాధ్య‌త పాల‌కుల‌తో పాటు.. విప‌క్ష రాజ‌కీయ పార్టీల‌ది కూడా.

 

మూసీ ‘ప్రక్షాళన’ కథలు సిరీస్‌లో రెండో భాగం… 

మూసీ ప్ర‌క్షాళ‌న‌పై పాల‌కుల చిత్తశుద్ధి ఎంత‌?

ఇవి కూడా చదవండి

Musi River | మీ ఇల్లు మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌లో మునిగిపోతుందా..? చెక్ చేసుకోండి ఇలా..! రెడ్, బ్లూ లైన్ల అర్థ‌మేంటో తెలుసా..?

Musi River | మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌లో జీహెచ్ఎంసీ కీల‌క నిర్ణ‌యం

Khammam drowned । ఆ రెండే ఖమ్మం పట్టణాన్ని ముంచాయి!