IAS | ఐఏఎస్‌లా? పాదదాసులా? సీఎంలకు ఆ పాదాభివందనాలేంటి?
పాలకులు ఐదేళ్లకోసారి మారిపోతుంటారు. అధికారులు మాత్రం అక్కడే కొనసాగుతూ ఉంటారు. అంటే వీరికి ఏ ప్రభుత్వంతోనూ అనుబంధాలు ఉండవు. ఉన్నా.. అవి విధి నిర్వహణకే పరిమితం. కానీ.. కొందరు ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రులకు పాదాభివందనాలు చేయడానికి ఉత్సాహం చూపడం తీవ్ర స్థాయిలో విమర్శలకు తావిస్తున్నది.

- గతంలో కేసీఆర్ కాళ్లు మొక్కిన వెంకట్రామిరెడ్డి
- తాజాగా గిరిజన శాఖ ముఖ్యకార్యదర్శి శరత్
- ఇద్దరూ కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారులే
- ఇదేం పోకడలంటున్న సాధారణ ప్రజలు
- గతంలో ఐఏఎస్ అధికారులపై దాడులను
తీవ్రంగా ఖండించిన ఐఏఎస్ అసోసియేషన్ - కాళ్లు మొక్కడాలపై మాత్రం స్పందన లేదు!
హైదరాబాద్, మే 22 (విధాత)
IAS | భారత దేశంలో అఖిల భారత సర్వీసు (AIS) అధికారులకు గౌరవం, మర్యాదలు ఉన్నాయి. అఖిల భారత సర్వీసులో ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS), ఐఎఫ్‌వో(IFO)లు రాష్ట్ర సర్వీసులలో పనిచేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా కొందరు ఐఏఎస్‌లు ప్రవర్తిస్తున్న తీరు వారి హోదాను, హుందాతనాన్ని పలుచన చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటెండర్లు, దఫేదార్లు నయం. కనీసం వారి విధి నిర్వహణ వరకూ పరిమితమవుతారు. కానీ.. పలువురు ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రుల కాళ్లు మొక్కుతున్నారు. అదేదో నాలుగు గోడల మధ్య ఇద్దరు ఉన్నప్పుడు ప్రవర్తిస్తే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బహిరంగంగా వేల మంది చూస్తుండగా సాష్టాంగపడిపోతున్నారు. ఐఏఎస్‌ల పాదాభివందనాలు చూసి.. సాధారణ జనం ఛీ కొడుతున్నారు. ఇలాంటి వారు ప్రజలకు ఏం సేవ చేస్తారు? చట్టాలను ఎలా అమలు చేస్తారు? అంటూ మండిపడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. రూ.12,600 కోట్లతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా సుమారు 2.1 లక్ష మంది గిరిజన రైతులకు సోలార్ విద్యుత్ మోటర్లను అందించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి లబ్ధిదారులకు మంజూరు సర్టిఫికెట్లు ఇస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి ఏ శరత్ ఆయన కాళ్లు మొక్కడం సంచలనం రేపింది. హఠాత్పరిణామంతో ఖిన్నుడైన ముఖ్యమంత్రి.. ఆయనను వారించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు టీవీ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి ఆశ్చర్యపోయారు. ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి సాధారణ పౌరుడి మాదిరి కాళ్లు మొక్కడం ఏంటని ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటనపై చర్చించుకోవడం మినహా ఏమి చేయలేరు కదా.
మొదలుపెట్టింది వెంకట్రామ్ రెడ్డి
ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఒకప్పటి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పరుపాటి వెంకట్రామ్ రెడ్డి కాళ్లు మొక్కే సంస్కృతికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వెంకట్రామ్ రెడ్డి గ్రూపు వన్ అధికారిగా ఎంపికై ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేశారు. 2007 సంవత్సరంలో ఐఏఎస్ అధికారి (కన్ఫర్డ్)గా ఎంపికయ్యారు. ప్రత్యేక రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2021 జూన్ నెలలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ భవనం ప్రారంభ సమయంలో తన నూతన చాంబర్‌లోని సీట్లో కూర్చునే ముందు వెంకట్రామ్ రెడ్డి నాటి సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేసి, అక్షింతలు వేయించుకున్నారు. ఐఏఎస్ అధికారి అయి ఉండి కేసీఆర్ కాళ్లకు దండం పెట్టడంపై ప్రచార, ప్రసార సాధనాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై వెంకట్రామ్ రెడ్డి సమర్థించుకున్నారుగానీ.. కేసీఆర్ ఇలాంటి పద్దతి సరికాదని అధికారిక ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి తన తండ్రిలాంటి వారని, అలాంటి పెద్ద మనిషి కాళ్లు మొక్కితే తప్పేంటని ఆనాడు వెంకట్రామిరెడ్డి ఎదురు ప్రశ్నించారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా ఏకంగా ఏడు సంవత్సరాల పాటు పనిచేసి.. కేసీఆర్‌కు దగ్గరయ్యారు. తన ఉద్యోగానికి వీఆర్ఎస్ పెట్టి 2021లో బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
కామారెడ్డిలో మొదటిసారి, మాచారంలో రెండోసారి
కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఏ శరత్ గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతకు ముందు కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. జూన్ 2021లో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టర్ సీట్లో ఆసీనులు కావడానికి ముందు శరత్ కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. ఆయన కూడా ఏమీ తడుముకోకుండా, వారించకుండా ఆశీస్సులు ఇచ్చారు. మొదటిసారి జరిగిన ఈ ఘటనను కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఖండించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ షబ్బీర్ అలీ కేంద్రంలోని డీవోపీటీ మంత్రికి ఫిర్యాదు చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తొలిసారి కావడం, తెలిసీ తెలియక చేశారని అనుకున్నారు. కాని అదే తీరును మరోసారి ప్రదర్శించి, జనాగ్రహానికి గురవుతున్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞాపికను అందచేసిన తరువాత ఆయన కాళ్లకు దండపెట్టారు. పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాదాలను కూడా తాకే ప్రయత్నం చేయగా, ఆయన ముందుకు కదిలారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు రావడంతో చర్యలకు ఉపక్రమించారు.
కాళ్లు మొక్కితే చర్యలు తప్పవు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు మరుసటి రోజు అనగా మంగళవారం రాత్రి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు దిగజారి ప్రవర్తించొద్దని, విధుల పట్ల అంకితభావం, నిబద్ధతతో ప్రజల విశ్వాసం పొందాలని సూచించారు. అతిక్రమిస్తే తగిన చర్యలు తప్పవని స్పష్టం చేయాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో కొంతమంది ఆల్ ఇండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారులు సమావేశాలు, సభల్లో హోదాకు తగని విధంగా చర్యలు, హావభావాలు ప్రదర్శిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఇలాంటి ప్రవర్తన ప్రజల్లో ఏఐఎస్ అధికారుల మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. ప్రజలతో సంబంధాల విషయంలోనూ, అత్యున్నత స్థాయి నైపుణ్యం, నిజాయతీ, నిబద్ధతను పాటించాల్సిన బాధ్యత కలిగి ఉండాలని, ఇది ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు అవసరమైన చర్య కాబట్టి, ఇకపై ఏ అఖిల భారత సర్వీసు అధికారులు అయినా, సమావేశాలు, సభల్లో మోకరిల్లడం, హావభావాలు ప్రదర్శించడం వంటి చర్యల నుంచి దూరంగా ఉండాలన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన అధికారిపై చర్యలు తప్పవని కే రామకృష్ణా రావు స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారా?
మాచారం సభలో శరత్ కాళ్లు మొక్కిన ఘటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించలేదంటున్నారు. ఈ పరిణామం తరువాత సీనియర్ ఆఫీసర్లు ఆయన ముందు ప్రస్తావించారో లేదా స్వయంగా ఆదేశించారో తెలియదు కానీ చర్యలు మొదలయ్యాయి. ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు మంగళవారం సాయంత్రం ఘాటుగా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కేసీఆర్ మాత్రం శరత్ తో పాటు వెంకట్రామ్ రెడ్డి కాళ్లు మొక్కించుకున్నారు కానీ ఇది తప్పని మాత్రం ప్రకటించలేదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆదేశాలు కూడా ఇప్పించలేదు. దీంతో శరత్ రెండో సారి సీఎం కాళ్లు మొక్కి స్వామి భక్తి నిరూపించుకునే పనిలో పడ్డారనే చెప్పాలి.
ఖండించని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై మాజీ మంత్రి కే తారక రామారావు చేసిన ఘాటు విమర్శలపై తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ప్రతీక్ జైన్ పై దాడి చేసిన వారిపై చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, సందీప్ కుమార్ ను కాంగ్రెస్ వర్కర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది కాని శరత్ కాళ్లు మొక్కడాన్ని మాత్రం ఇంత వరకు ఖండించలేదు. అందుకే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయనేది అసోసియేషన్ పసిగట్టకపోవడం దారుణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.